భయం.. భయం..
కంకిపాడు: ధాన్యం లోడులు కదలటం లేదు. నిన్నటి వరకూ గోనె సంచుల కొరతతో ఇబ్బందులు పడ్డ రైతులు.. ప్రస్తుతం రవాణా వాహనాల సమస్యతో అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా ధాన్యం రోడ్ల పక్కనే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో పంట ఏమవుతుందో అన్న ఆందోళన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు విన్నవిస్తున్నారు.
మెండుగా దిగుబడులు..
ఈ ఏడాది రబీ సీజన్‌లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 12,285 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించటం దిగుబడులు గణనీయంగా వచ్చాయి. ఎకరాకు 45–50 బస్తాల వరకూ దిగుబడులు చేతికొచ్చాయి. 43 వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్‌లో మిగులు ధాన్యంతో కలిపి ఈ దఫా 75వేల టన్నులు ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 50వేల టన్నులకు పైగా ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సేకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతా ల్లో మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ధాన్యం బస్తాలు రోడ్డు మార్జిన్‌లలో నిల్వ చేసి ఉంచారు.
రవాణా వాహనాలు ఏవీ?
జిల్లా వ్యాప్తంగా రవాణా వాహనాల సమస్య జటిలంగా ఉంది. అష్టకష్టాలు పడి రైతులు ఆర్‌ఎస్ కేలు, మిల్లుల వద్ద నుంచి గోనె సంచులు తీసుకుని ఆరబోసిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తుకున్నారు. అయితే రవాణా వాహనాలు సమృద్ధిగా లేకపోవటంతో ధాన్యం ఎక్కడిదక్కడే పేరుకుపోయింది. లారీలు రాకపోవటంతో బస్తాలు మిల్లులకు కదలటం లేదు. అధికారులు, మిల్లర్ల చుట్టూ పదే పదే తిరిగినా సమస్య అరకొరగానే తీరుతుంది తప్ప, పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచటం లేదని రైతులు వాపోతున్నారు. దళారులకు వెంటనే లారీలను పంపే మిల్లర్లు రైతుల పక్షాన నిలవటం లేదన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కంకిపాడు మండలానికే సుమారు 30 లారీలకు పైగా అవసరం ఉందంటే సమస్య తీవ్రత ఇట్టే అవగతమవుతుంది.
అకాల వర్షాలు రైతులను పట్టి పీడిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు కుదేలవుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషించే లోపే, అకాల వర్షాలు తమ పాలిట శాపంగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి వేళల్లో ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలీక, కల్లాలు, రోడ్డు మార్జిన్‌లలోనే పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కాపాడుకున్న పంట ఎక్కడ వర్షం బారిన పడి నష్టపోవాల్సి వస్తుందోనన్న భయంతో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
రైతన్నకు కంటి మీద కునుకు కరువు