
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి స్కూల్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. మండలంలోని గుంటుపల్లి వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 5వ తరగతి చదువుతున్న నవ్యశ్రీ(10) మృతిచెందగా, మరో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటుపల్లి డాన్‌బాస్కో పాఠశాలకు భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు రోజూ ఆటోలో వచ్చి వెళ్తుంటారు.
పాఠశాల ముగిసిన అనంతరం 14 మంది విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో విద్యాధరపురం కామకోటినగర్‌కు చెందిన పరువాల ఆనంద్ కుమార్తె నవ్యశ్రీ (10) మృతి చెందింది. గాయపడిన మరో నలుగురు విద్యార్థులను గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పి.శ్రీను తెలిపారు.