
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది.