కల్యాణమే.. వైభోగమే..

సీతారాముల కల్యాణంలో పీటలపై కూర్చున్న అధికారులు  - Sakshi

భవానీ ద్వీపంలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో వేడుక

భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక పర్యాటకం (రెలిజియస్‌ టూరిజం)లో భాగంగా విజయవాడ భవానీ ద్వీపంలో చలువ పందిరి వేసి అందులో రాములోరి కల్యాణాన్ని జరిపించారు. ఈ కల్యాణంలో పీటలపై ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) గోవిందరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) మల్‌రెడ్డి, ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ రుషి భరద్వాజ దంపతులు, అప్‌కాస్ట్‌ మెంబర్‌ సెక్రటరీ డాక్టర్‌ వై. అపర్ణ కూర్చొన్నారు. కల్యాణం అనంతరం ఆంధ్రా శివమణి మాస్టర్‌ చెర్రీ స్వరూప్‌ డ్రమ్స్‌ వాయించగా, విజయదుర్గ మహిళా కోలాట బృందం ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే కృష్ణాజిల్లా గరికపర్రుకు చెందిన రాజీవ్‌ డప్పు కళాకారుల బృందం విన్యాసాలు, కళాక్షేత్ర డాన్స్‌ అకాడమీ నాట్యాచారిణి హవీష్‌ చౌదరి శిష్య బృందం కూచిపూడి, జానపద నృత్యాలు పర్యాటకులు/సందర్శకులను విశేషంగా అలరించాయి. చివరిగా ప్రత్యేక వాహనంపై స్వామివారి పవళింపు సేవ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమాన్ని రెలిజియస్‌ టూరిజం స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ నిర్వహించగా బీఐటీసీ ఇడి బలరామిరెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ మూర్తి, జనరల్‌ మేనేజర్స్‌ హరనాథ్‌(హోటల్స్‌), శ్రీనివాస్‌(అడ్మిన్‌), నాగేశ్వరరావు (బోటింగ్‌), జయదేవ్‌ (ఓఅండ్‌ఎం), బెరంపార్క్‌, భవానీ ఐలాండ్‌ మేనేజర్స్‌ సత్యారావు, డి. సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top