కాగజ్‌నగర్‌టౌన్: నూలు దారంతో వస్త్రాలునేసి జీవనాన్ని కొనసాగిస్తున్న నేతన్నలపై ప్రభుత్వ ఈ– టెండర్‌ఽ విధానం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆర్డర్లు లేక చేనేత కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో చేనేత పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వ రంగ సంస్థ అయిన టెస్కో(టీజీఎస్‌సీవో) ద్వారా వివిధ వస్త్రాలకు ఈ సంఘాలు ఆర్డర్ పొందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన టవళ్లు, కార్పెట్లు, బెడ్‌షీట్లు వంటివి ఇక్కడే తయారు చేసి అందిస్తారు. కానీ ప్రభుత్వం ఈ– టెండర్ విధానంతో టీజీఎస్‌సీవో ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ విధానం అమలు చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.
మార్చిలోనే నోటిఫికేషన్
2025– 27 సంవత్సరానికి టెస్కో నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదు. తీరా ప్రభుత్వం గ్రూప్‌నకు ముగింపు పలుకుతూ మార్చిలో ఈ– టెండర్ విధానాని కి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు ఆర్డర్ దక్కించుకుంటే నేతన్నలు రోడ్డున పడే దుస్థితి నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలు పవర్‌లూమ్ వస్త్రాలకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. చేనేత వస్త్రాలకు సరైన ధర దక్కదు. వాటిని మార్కెట్‌లో కూడా విక్రయించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా కార్మికులు మగ్గాలకు దూరమై ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముంది.
పాత పద్ధతిని పునరుద్ధరించాలి
వివిధ శాఖలకు అవసరమైన వస్త్రాలను అందించే బాధ్యతను ఈ– టెండర్ విధానంతో కాకుండా పాత పద్ధతిని పునరుద్ధరించాలి. ఆర్డర్ రద్దు చేయడంతో నేత కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టినట్లుయింది. ప్రభుత్వం పునరాలోచన చేసి చేనేత రంగానికి అండగా నిలవాలి.
– నల్ల కనకయ్య, మేనేజర్,
బెజ్జూర్ చేనేత పారిశ్రామిక సహకార సంస్థ
కలవరపెడుతున్న ప్రభుత్వ నిర్ణయం
కాగజ్‌నగర్ చేనేత పారిశ్రామిక సంఘంలో 40 మగ్గాలపై 30 మంది కార్మికులు, చెన్నూర్‌లో 80 మగ్గాలపై 60 మంది కార్మికులు వస్త్రాలను నేస్తుంటారు. వారికి టీఎస్‌కో ఆర్డర్లు అందజేస్తుంది. ఈ రెండు సంఘాల పరిధిలో ఏటా రూ.80 లక్షల మేర వస్త్రాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నేతన్నలను కలవరపెడుతోంది. ఇక నుంచి టీఎస్‌కోకు కాకుండా ఓపెన్ టెండర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆర్డర్లు లేక నేత మగ్గాలు వెలవెలబోయే పరిస్థితులు ఏర్పడతాయని కార్మికులు చెబుతున్నారు.


