చివరి ఆశలు | - | Sakshi
Sakshi News home page

చివరి ఆశలు

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

బొక్కివాగు ప్రాజెక్టులో గణనీయంగా తగ్గిన నీటిమట్టం ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా కాలువలకు నీటి మళ్లింపు సాగునీటి కోసం ఆయకట్టు రైతులకు తప్పని తిప్పలు

అడుగంటిన

ప్రాజెక్టు నుంచి ట్రాక్టర్‌ ఇంజిన్‌ ద్వారా కాలువలకు నీటిని మళ్లిస్తూ..

సాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైపులు

చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు పొట్టె బాపు. పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ గ్రామానికి చెందిన ఇత ను బొక్కివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో యాసంగి సీజన్‌లో వరి పంట సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పంట గింజ దశలో ఉంది. మరో 20 రోజుల్లో కోతకు రానుండగా.. చివరి తడికి నీరందడం లేదు. కళ్ల ముందే పంట ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నాడు.

పెంచికల్‌పేట్‌: దంచికొడుతున్న ఎండలతో ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. పంటల చేతికందే దశలో సాగునీటి కటకట అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. పెంచికల్‌పేట్‌ మండలంలోని బొక్కివాగు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో ప్రాజెక్టు నుంచి కాలువల్లోకి నీళ్లు రావడం లేదు.

500 ఎకరాల్లో సాగు..

పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ గ్రామం వద్ద బొక్కివాగుపై 2వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 2012లో బొక్కివాగు ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.18 కోట్ల నిధులను వెచ్చించారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాల్లో అన్నదాతలు వరి పంట సాగు చేస్తున్నారు. ఎండలకు బొక్కివాగు ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో కాలువల నుంచి పంట పొలాలకు నీరు చేరడం లేదు. రైతులు ఆయిల్‌ ఇంజిన్లు, విద్యుత్‌ మోటార్లు, పైపుల ద్వారా పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు.

అడుగంటిన నీరు..

గతేడాది కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టు నుంచి పొలాలకు నీటి అందించే కుడి, ఎడమ కాలువల గేట్లు చెడిపోవడంతో ఏడాది కాలంగా నీరు వృథాగా పోయింది. ఎన్నో ఆశలతో యాసంగి సీజన్‌లో సాగు చేసిన చివరి తడికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్లూర్‌, పెంచికల్‌పేట్‌, మెరెగూడ గ్రామాలకు చెందిన రైతులు నీటిని పంట పొలాలకు తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాజెక్టులో ఆయిల్‌ ఇంజిన్లు, మోటార్లు, పైపులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రాత్రి, పగలు తేడా లేకుండా ప్రాజెక్టు వద్ద పడిగాపులు కాస్తున్నారు. మోటార్ల ద్వారా నీటిని కాలువలోకి మళ్లించి అక్కడి నుంచి పంట పొలాలు తడుపుతున్నారు. అయినా కూడా కేవలం ప్రాజెక్టు సమీపంలో సాగు చేస్తున్న పంటలకు మాత్రమే నీరందుతోంది. దూర ప్రాంతాల్లోని పొలాల రైతులు దిగుబడుపై ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement