జిల్లా జనాభాలో 40.10 శాతం వారే.. ద్వితీయ స్థానంలో ఎస్టీలు 30.08 శాతం కులం లేనివారు 9,471 మంది కులాల వారీగా జనాభా వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆసిఫాబాద్: కులాల వారీగా జనాభా వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. కుల గణన– 2024లో భాగంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే వివరాలను ఎట్టకేలకు విడుదల చేసింది. జిల్లాలోని 15 మండలాల్లో 1,64,320 కుటుంబాలు ఉండగా, 5,57,464 జనాభా ఉంది. అత్యధికంగా బీసీలు 40.10 శాతం ఉండగా, తర్వాత ఎస్టీలు 30.08 శాతం, ఎస్సీలు 15.46 శాతం, ఓసీలు 8.08 శాతం, బీసీ ముస్లిం మైనార్టీలు 6.27 శాతం ఉన్నారు. కులం ప్రస్తావన లేని కుటుంబాలు 2,326 ఉండగా, వారి జనాభా 9,471 ఉండటం విశేషం.
మాలి కులస్తులు 56,140 మంది..
జిల్లావ్యాప్తంగా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే అధికంగా ఉండగా, ముస్లిం మైనార్టీలు కాకుండా వారి కుటుంబాలు 69,071, జనాభా 2,23,563 ఉంది. ముస్లిం మైనార్టీలు(బీసీఈ) 34,963(6.27 శాతం) ఉన్నారు. మాలి కులస్తులు జిల్లాలో 56,140(21.72శాతం) మంది ఉండటం విశేషం. ఆ తర్వాత మున్నూరుకాపు కులస్తులు 23,234(8.99శాతం), ఆరె, ఆరెవల్లు 44,352(17.16శాతం), యాదవ 16,016(6.20శాతం), గౌడ కులస్తులు 5,451(2.11శాతం), గాండ్ల తేలి 7,118(2.75 శాతం), పద్మశాలి 9,234(3.57శాతం), ముస్లిం షేక్‌లు 29,722(11.50శాతం), రజక 4982(1.93 శాతం), వడ్డే 2433(0.94 శాతం), పెరిక 2369(0.92 శాతం), గోల్డ్ స్మిత్‌లు 2344(0.91 శాతం), బ్లాక్ స్మిత్‌లు 1969(0.76 శాతం), వడ్రంగి 3034(1.17 శాతం), మేర 2361(0.91) శాతం), ముదిరాజ్ 4140(1.60 శాతం), వంజర 2482(0.96 శాతం), ఇతర కులస్తులు ఉన్నారు.
ఎస్సీ జనాభా 86,207
జిల్లా వ్యాప్తంగా 26,251 ఎస్సీ కుటుంబాలు ఉండగా, వారి జనాభా 86,207 ఉంది. ఇందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 22,159(25.70 శా తం), మహర్ 18,596(21.57 శాతం), మాల, మాల అయ్యవారు 24,353(28.25 శాతం), మాలసాలె, నేతకాని (13,396(15.54 శాతం), మంగ్ 124(4.78 శాతం) ఉన్నారు.
ఓసీలు 8.08 శాతం
11,863 ఓసీ కుటుంబాలు ఉండగా, వారి జనాభా 45,051 ఉంది. బ్రాహ్మణ 1612((3.58 శాతం), కమ్మ 522(1.16 శాతం), వైశ్య 4,417(9.80 శాతం), ముస్లింలు(బీసీ–ఈ కాకుండా) 12,277(27.25 శాతం), వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు 266(0.59 శాతం) మంది ఉన్నారు.
ద్వితీయ స్థానంలో ఎస్టీలు
జిల్లాలో ఎస్టీ జనాభా ద్వితీయ స్థానంలో ఉంది. మొత్తం 47,788 కుటుంబాలు ఉండగా, వారి జనాభా 1,67,680 ఉంది. వీరిలో గోండు, నాయక్‌పోడ్, రాజ్‌గోండ్, కోయిటూర్ జనాభా 75,312(44.91 శాతం), కొలాం కోలావార్ 40,506(24.16శాతం), కోయ 17,470(10.42 శాతం), లంబాడా, బంజారాలు 22,685(13.53 శాతం), పర్దాన్ 4141(2.47 శాతం) మంది ఉన్నారు.
జిల్లాలో వివరాలు
సామాజిక వర్గం కుటుంబాలు శాతం జనాభా శాతం
బీసీలు(ముస్లిం మైనార్టీలు కాకుండా) 69,071 42.02 2,23,563 40.10
ముస్లిం మైనార్టీలు 9,347 5.69 34,963 6.27
ఎస్టీలు 47,788 29.08 1,67,680 30.08
ఎస్సీలు 26,251 15.98 86,207 15.46
ఓసీలు 11,863 7.22 45,051 8.08


