ఈజీ మనీ కోసం యువత పెడదారి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుని ఆర్థిక నష్టాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన ఐపీఎల్ నేపథ్యంలో నిఘా అవసరం
కౌటాల: యువతను బెట్టింగ్ భూతం పీడిస్తోంది. గత నెలలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియల్ లీగ్ మ్యాచ్‌ల క్రేజ్ పల్లెలకు పాకింది. ఈ నేపథ్యంలో కొందరు యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఆన్‌లైన్ యాప్‌ల సాయంతో ఇంటి నుంచే బెట్టింగ్ కాస్తున్నారు. మహానగరాలు, పట్టణాల నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలిసీతెలియక యువత డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కౌటాల, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో బెట్టింగ్‌లు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
ఆగని దందా..
యువత ఇష్టాన్ని బెట్టింగ్ సంస్కృతిని ఆసరా చేసుకుంటున్న కొందరు క్రికెట్‌తో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం బెట్టింగ్‌ను ఆరికట్టేందుకు ఇటీవల అనేక యాప్‌లను నిషేధించింది. కానీ బెట్టింగ్ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. వీపీఎన్ ద్వారా ఇతర దేశాల లొకేషన్లు వాడుతున్నారు. మరికొందరు కమీషన్లు తీసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్నేహితులు బృందాలుగా ఏర్పడి బాల్ బాల్‌కు బెట్టింగ్ పెట్టి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. యూపీఐల ద్వారా సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉండడంతో స్మార్ట్‌ఫోన్ల నుంచి ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఆటపై పూర్తిస్థాయి అవగాహన లేనివారు సైతం తమకు తెలిసిన వారిని మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అంచనా వేస్తూ మరీ బెట్టింగ్‌కు పాల్పడుతుండటం గమనార్హం.
నిఘాతోనే కట్టడి..
ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రస్తుతం ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున్న పాల్గొంటున్న తరుణంలో కట్టడి ఇంటి నుంచి జరగాలి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. డబ్బు ఖర్చు పెడుతున్న తీరును అడిగి తెలుసుకోవాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగినప్పుడు ఎందుకని ఆరా తీయాలి. పెడదారిన వెళ్తున్నట్లు గమనిస్తే వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన సదస్సులకు పంపించాలి. గతంలో కౌటాల, కాగజ్‌నగర్, సిర్పూర్(టి)కి చెందిన పలువురు క్రికెట్ బెట్టింగ్ పాల్ప డుతూ పోలీసులకు చిక్కారు. బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, దందాను రూపుమాపేందుకు పోలీసులు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


