ఆసిఫాబాద్‌అర్బన్: డ్రైవర్లకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను అన్నారు. వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ, డ్రైవర్లు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించా రు. అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవా రం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రథమ చికిత్స పద్ధతులు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్ వీర్ యోజన, గుడ్ సమారిటన్ నిబంధనలు, పీఎం రాహత్ గురించి వివరించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాల నివారణ, పరికరాల విని యోగం, రక్షణాత్మక డ్రైవింగ్, వాహన తనిఖీలు, రాత్రి సమయాల్లో డ్రైవింగ్ నైపుణ్యాలపై శిక్షణ గురించి తెలియజేశారు. డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రాణాలు, కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. డ్రైవర్ల కంటిచూపు మందగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి రాంచందర్, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎం రాజశేఖర్, మోటార్ వాహన పరిశీలకులు శంకర్, రాజ మల్లు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.


