ఆసిఫాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం డీఎంహెచ్‌వో సీతారాంతో కలిసి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యులు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావొద్దన్నారు. వేసవి నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాంక్షిత బ్లాక్, జిల్లా కార్యక్రమంలో భాగంగా గర్భిణుల వివరాలు వందశాతం నమోదు చేయాలని ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలన్నారు. పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాల్లో నెలకు రెండుసార్లు వైద్యబృందాలు సందర్శించాలని సూచించారు.


