జిల్లాకు ఐదు డయాలసిస్ కేంద్రాలు మంజూరు త్వరలో అందుబాటులోకి 25 రక్తశుద్ధి యంత్రాలు రోగులకు తప్పనున్న దూరభారం
కౌటాల: జిల్లాలో బాధితులకు డయాలసిస్ సేవలు చేరువకానున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రం, కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుతుండగా, తాజాగా జిల్లాకు మరో ఐదు డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోగులు వైద్యసేవల కోసం గంటల తరబడి ప్రయాణం చేయడం నరకప్రాయంగా మారింది. డయాలసిస్ దశలో మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ చితికిపోతారు.
వడపోయని కిడ్నీలు..
ప్రస్తుతం జిల్లాలో వంద మందికి పైగా డయాలసిస్ బాధితులు ఉండగా, వీరికి రోజు విడిచి రోజు డ యాలసిస్ చేస్తున్నారు. మారుతున్న జీవన విధా నం, కలుషిత నీరు, రసాయనాలతో కూడిన ఆహా రంతో ఏటా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. చిన్న పిల్లలు సైతం ఈ వ్యాధి బారిన పడటం విషాదకరం. మహిళలైతే ఇంటి పనుల ధ్యాసలో పడి కిడ్నీల ఆరోగ్య స్థితిగతులను పూర్తిగా విస్మరిస్తున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఇతర అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే ఆహారం రుచించదు. ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. తరచూ వికారం, వాంతులు అవుతుంటాయి. మూత్రపిండాల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. అలసట, మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఐదు కొత్త కేంద్రాల మంజూరు
మూత్రపిండాల చికిత్స పేద, మధ్య తరగతి ప్ర జలకు భారంగా మారడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా జిల్లాలోని కిడ్నీ రోగులకు ఊరటనిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఐదు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయగా, 25 రక్తశుద్ధి యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఈ నెల 15న ఉత్తర్వులు వెలువడ్డాయి. బెజ్జూర్, జైనూర్, తిర్యాణి సీహెచ్‌సీ లు, కౌటాల, కెరమెరి పీహెచ్‌సీల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ కేంద్రంలో ఐదు రక్తశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తారు. సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అర్ధరాత్రి వరకు డయాలసిస్ సెషన్లు నడుస్తున్నాయి. కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రయాణ భారం తగ్గడమే కాకుండా మెరుగైన సేవలు సకాలంలో అందుతాయి. గతంలో బాధితులు మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు సైతం వెళ్లేవారు.


