● వేసవిలో భూసార పరీక్షలు చేయించడం ఉత్తమం ● ఆదిలాబాద్‌కు నమూనాలు పంపితే నెల రోజులకు రిపోర్టు ● రైతులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం | - | Sakshi
Sakshi News home page

● వేసవిలో భూసార పరీక్షలు చేయించడం ఉత్తమం ● ఆదిలాబాద్‌కు నమూనాలు పంపితే నెల రోజులకు రిపోర్టు ● రైతులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● వేసవిలో భూసార పరీక్షలు చేయించడం ఉత్తమం ● ఆదిలాబాద్‌కు నమూనాలు పంపితే నెల రోజులకు రిపోర్టు ● రైతులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం

దహెగాం: నేల తల్లి ఆరోగ్యం బాగుంటేనే.. రైతు ఇంటికి సిరి సంపదలు చేరుతాయి. విత్తనాలు, వర్షాలపైనే కాకుండా భూమిలోని పోషకాలపై కూడా దిగుబడులు ఆధారపడి ఉంటాయి. రైతులు ఇష్టారీతిన రసాయన ఎరువులు వినియోగించడం ద్వారా ఓ వైపు పెట్టుబడి భారమవుతుండగా, నేల కూడా నిస్సారమవుతోంది. చాలామంది అవగాహన లేక ఏటా ఒకే పంట పండించడంతోనూ భూమిలో నిర్దిష్ట పోషకాలు హరించుకుపోయి దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్‌కు ముందు వేసవిలో భూసార పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ప్రస్తుతం యాసంగి సాగు కూడా ముగింపు దశకు చేరుకుంది. వరి, మొక్కజొన్న పంటలు మరికొద్ది రోజుల్లో కోతకు రానున్నాయి. అనంతరం పంట పొలాలు బీడుగా ఉంటాయి. ఇదే భూసార పరీక్షలకు ఇదే అత్యంత అనువైన సమయం. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండటంతో వేసవిలో మట్టి నమూనాలు సేకరించడం సులభం. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎర్ర నేలలు ఎప్పుడూ పొడిగానే ఉండటంతో ఆయా ప్రాంతాల్లో నమూనాలు సేకరణ, పరీక్షలు ఎప్పుడైనా చేయొచ్చు.

ఆదిలాబాద్‌లో ఎస్‌టీఎల్‌

జిల్లావ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో స్థానికంగా భూసార పరీక్ష కేంద్రం(ఎస్‌టీఎల్‌) లేదు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను అధికారులు ఆదిలాబాద్‌లోని సాయిల్‌ టెస్ట్‌ ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ పరీక్షలు పూర్తయ్యాక భూమిలో ఉన్న పోషకాల వివరాలతో కూడిన రిపోర్ట్‌ ఇస్తారు. దీని ఆధారంగా ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలుస్తుంది. మట్టి నమూనా పంపిన నెల రోజుల్లో ఈ నివేదిక అందుతుందని అధికారులు చెబుతున్నారు.

మూలకు చేరిన నమూనా ల్యాబ్‌లు

మట్టి నమూనాలను ఆదిలాబాద్‌ పంపడం ద్వారా జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి 2018లో ప్రభుత్వం మండల కేంద్రాలు, క్లస్టర్ల వారీగా భూసార పరీక్ష మిషన్లను మంజూరు చేసింది. వీటికి అవసరమైన కెమికల్స్‌ కూడా రెండేళ్లపాటు సరఫరా చేశారు. అప్పట్లో పరీక్షలు బాగానే జరిగాయి. కానీ రసాయనాల సరఫరా నిలిచిపోవడంతో ఆ మిషన్లన్నీ మూలకు చేరాయి. రూ.లక్షల విలువైన పరికరాలు ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు అధికారులు సైతం సరైన రీతిలో రైతులకు మట్టి పరీక్షలపై అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి పరికరాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement