రెబ్బెన మండలం గోలేటికి చెందిన ఆజ్మెర సుక్లాల్ ఉపాధి పనులకు వెళ్తున్నాడు. పని ప్రదేశంలో ఆన్‌లైన్ ద్వారా ఐరీస్ (కంటి పాపల ఆధారంగా) హాజరు నమోదుకు ప్రయత్నించగా మొదటిరోజు తీసుకోలేదు. ఈజీఎస్ సిబ్బంది కేవైసీ చేయడంతో రెండోరోజు హాజరు సాధ్యమైంది. మూడో రోజు మళ్లీ రెండు కిలోమీటర్ల దూరంలోని పని ప్రదేశానికి వచ్చి హాజరు పడకపోవడంతో పని చేయకుండానే తిరిగి వెళ్లిపోయాడు... ఇది కేవలం సుక్లాల్‌కు ఎదురైన ఇబ్బంది మాత్రమే కాదు.. జిల్లాలో దాదాపు 20శాతం కూలీలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
తిర్యాణి: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్(వీబీ జీ రాం జీ)గా మార్పు చేసింది. గతంలో జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి వందరోజుల పనిదినాలు కల్పించగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 125 రోజుల పని దినాలు అమలు చేస్తున్నారు. జిల్లాలో 1.22 లక్షల జాబ్‌కార్డులు ఉండగా ఇందులో 84 వేల కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1.52 లక్షల కూలీలు ఉన్నారు. పథకం ప్రారంభం నుంచి నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ వినియోగించారు. దాని ప్రకారం కూలీల హాజరు మ్యానువల్‌గా తీసుకునేవారు. అలాగే చేసిన పనితోపాటు అదనపు భత్యాలు(వేసవి భత్యం) కూలితో కలిపి 30 శాతం అదనంగా ఇచ్చేవారు. పనిప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే కిలోమీటర్‌కు కొంత చొప్పున చెల్లించేవారు. తాగునీటికి సైతం డబ్బులు వేతనాల్లో జమ చేసేవారు. కానీ నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌లో ఈ సదుపాయాలన్నీ తొలగించారు. కేవలం చేసిన పనికి మాత్రమే వేతనంగా చెల్లిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో హాజరు..
ప్రస్తుతం పనులకు సంబంధించి హాజరు అంతా ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎన్‌ఎంఎస్) యాప్‌లో వివరాలు పొందుపరుస్తున్నారు. ఉదయం పూట ఒకసారి, మధాహ్నం తర్వాత మరో ఫొటోను(మొదటి ఫొటో అప్‌లోడ్ చేసిన నాలుగు గంటల తర్వాత) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఉదయం తీసుకునే ఫొటోలో కచ్చితంగా ఒక్కో కూలీకి సంబంధించిన ఐరీస్ ఉండాలి. మధ్యాహ్నం గ్రూప్ ఫోటోను అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది కూలీలకు సంబంధించిన ఐరీస్‌ను సాఫ్ట్‌వేర్ తీసుకోవడం లేదు. దీంతో వారు పనులు చేయకుండానే ఇంటికి వెళ్తున్నారు. ఒక్కోసారి కూలీల ఐరీస్ ఒకరోజు తీసుకుంటే.. మరోరోజు ఐరిస్ తీసుకోకుండా ఫేస్ మిస్ మ్యాచ్ అని చూపిస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్‌లైన్ హాజరుకు అధిక సమయం పడుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతుండటంతో పని ప్రదేశంలోనే నాలుగు గంటలకు పైగా ఉండాల్సి వస్తోంది. గతేడాది ఇదే సీజన్‌లో 20 వేలకు పైగా కూలీలకు పనులకు వెళ్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలు కూడా దాటడం లేదు. తిర్యాణి మండలంలోని గోవెన వంటి పంచాయతీలోని గ్రామాలకు ఎలాంటి సిగ్నల్స్ అందుబాటులో లేక పనులు చేపట్టడం లేదు.
పథకం రద్దు చేయాలని కుట్రలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేసి పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే రెండు ఫొటోల విధానాన్ని తీసుకొచ్చింది. చాలా మంది కూలీలకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ కాకపోవడంతో పని చేయకుండానే వెనుదిరుగుతున్నారు. పాత విధానంలోనే పనులు చేపట్టి, కనీస వేతనం రోజుకు రూ.800 చెల్లించాలి.
– ముంజం ఆనంద్, తెలంగాణ
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్


