ఆసిఫాబాద్‌అర్బన్: రహదారి నిబంధనలపై ప్రతిఒక్కరికి అవసరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమలగార్డెన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల ప్రదేశంలోని రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి స్కూల్‌లో నిబంధనలపై సైన్ బోర్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కోరారు. అనంతరం విద్యార్థులతో రహదారి నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. డీఈవో లలిత, డీటీవో రాంచందర్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం చేయాలి
జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం చేసి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో, టీ ఫైబర్ టవర్ల నిర్మాణాలు, స్థల ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ భారత్ నిధి కింద బీఎస్‌ఎన్‌ఎల్ మంజూరైన 24 టవర్ల నిర్మాణానికి స్థలాల ఎంపిక చేపట్టాలన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సంయుక్తంగా సర్వే పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే, పీఆర్ ఈఈ ధర్మేందర్, భగీరథ ఈఈ సిద్దిఖ్ తదితరులు పాల్గొన్నారు.


