నూతన సంవత్సరాది.. ‘పోయ్‌లా బైసాఖి’ | - | Sakshi
Sakshi News home page

నూతన సంవత్సరాది.. ‘పోయ్‌లా బైసాఖి’

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

● బెంగాలీ ప్రాంతాల్లో పండుగ శోభ ● కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు

చింతలమానెపల్లి: బెంగాలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలు నూతన సంవత్సర పండుగ శోభను సంతరించుకున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బెంగాలీల కొత్త సంవత్సరం పోయ్‌లా బైసాఖి వేడుకలు మంగళవారం సంబు రంగా ప్రారంభమయ్యాయి. పండుగ నేపథ్యంలో మహదేవుడు శివుడికి భారీగా పూజలు నిర్వహించా రు. తారక్‌నాథ్‌ రూపంలో ప్రత్యేక దైవానికి సామూహికంగా పూజలు చేసి గత సంవత్సరానికి వీడ్కోలు పలికారు. వైశాఖ మాసం మొదటి రోజును పురస్కరించుకుని గణపతి, లక్ష్మీదేవి, దుర్గాదేవిలకు ఇళ్లలో పూజలు చేసి సంవత్సరానికి స్వాగతం పలికారు. భగవతి పూజలో భాగంగా పశువులను పూజించారు. తులసీమాతకు జలాభిషేకం, గంగాపూజ చేశారు. ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించి దీపాలను వెలిగించారు. బుధవారం సైతం పూజలు, కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

పవిత్ర మాసం వైశాఖం

పోయ్‌లా అనేది పెహలా అనే హిందీ పదం నుంచి వచ్చింది. బైసాఖి అనేది సంవత్సరంలో వచ్చే మొదటి నెలను సూచిస్తుంది. వైశాఖమాసం ప్రారంభాన్ని నూతన సంవత్సరాదిగా బెంగాలీలు జరుపుకొంటున్నారు. ఏటా ఏప్రిల్‌ 13, 14, 15 తేదీల్లో ఈ పండుగ వస్తుంది. తెలుగు సంవత్సరాది ఉగాది అ నంతరం ఉత్సవాలు జరుపుకోవడం విశేషం. బెంగాలీ నెలలు 12 కాగా.. ఒక్కో నెలలో 32 రోజులు, 31, 30, 29 రోజులు కూడా ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న నూతన సంవత్సరం ప్రారంభమైంది. 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు.

ప్రత్యేక కార్యక్రమాలు

నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని బుధవా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నూతన కార్యక్రమాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, గృహ నిర్మాణాలు ప్రారంభించడం, గృహ ప్రవేశం, వ్యాపారులు కూడా వాణిజ్య ఖాతా పుస్తకాలను ఈ రోజే ప్రారంభిస్తారు. హల్‌ ఖాతాగా పిలిచే ఈ సందర్భాన్ని వ్యాపారులు పవిత్రంగా భావిస్తారు. మరోవైపు కాగజ్‌నగర్‌ మండలం ఈస్‌గాం, నజృల్‌నగర్‌, నామానగర్‌, సీతానగర్‌, చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్‌– 1, రవీంద్రనగర్‌– 2, సిర్పూర్‌(టి) మండలంలోని లక్ష్మిపూర్‌ వేడుకలకు వేదికగా నిలుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement