సర్కార్‌ సత్తా | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ సత్తా

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

● 9 కేజీబీవీల్లో వందశాతం ఉత్తీర్ణత ● ఫలితాల్లో మెరుగుపడిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

రెబ్బెన: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అదరగొట్టారు. అడవుల జిల్లాగా పేరుగాంచిన కుమురం ఆసిఫాబాద్‌ జిల్లా తనదైన ముద్ర వేసుకుంది. ఈసారి ఒకేషనల్‌ విద్యార్థులు జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు గతేడాది కంటే ఈసారి కాస్త మెరుగైన ఫలితాలనే సాధించినా ఒకస్థానం కిందకు దిగారు. అయినా ఉత్తీర్ణత పెరగడం సానుకూలంశం.

ఉత్తమంగా నిలిచిన కేజీబీవీలు

జిల్లాలో 15 మండలాలు ఉండగా 12 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ విద్యాలయాల్లో గతంలో పదో తరగతి వరకు మాత్రమే ఉండగా ప్రభుత్వం ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేసింది. బాలికలు పదో తరగతి పూర్తయ్యాక ఇతర కళాశాలల వైపు చూడకుండా అందులోనే ఇంటర్‌ విద్యను అభ్యసించేందుకు వెసులుబాటు కలిగింది. కొన్ని కేజీబీవీల్లో జనరల్‌ గ్రూప్‌లు మాత్రమే కొనసాగుతుండగా, అధ్యాపకుల లభ్యతను బట్టి మరిన్ని కొన్నింటిలో ఒకేషనల్‌ తరగతులు సైతం బోధిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో తొమ్మిది కేజీబీవీలు రెండో సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి వందశాతం సాధించిన కళాశాలలు రెండు ఉన్నాయి. జైనూర్‌, సిర్పూర్‌(యు) కేజీబీవీల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. జైనూర్‌, లింగాపూర్‌, సిర్పూర్‌(యు)లో కేవలం మొదటి సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరంలో కస్తూరిబా గాంధీ విద్యాలయాలు 94శాతం, రెండో సంవత్సరంలో 98.5 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పేద విద్యార్థులు రూ.వేలు ఫీజులు దండుకునే ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మార్కులు సాధించారు. రెబ్బెన మండలంలోని గంగాపూర్‌ కేజీబీవీకి చెందిన బైపీసీ విద్యార్థిని సంజన 980 మార్కులు సాధించి కేజీబీవీల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. రెండో స్థానంలో కాగజ్‌నగర్‌ కేజీబీవీకి చెందిన గంగారాణి ఎంపీసీలో 978 మార్కులు సాధించింది. ఫస్టియర్‌లో సిర్పూర్‌(టి) కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ చదువుతున్న ఎన్‌.మేనక, సీహెచ్‌.పల్లవి 488 మార్కులు సాధించగా, వాంకిడి విద్యార్థిని అశ్విని 487 మార్కులు సాధించింది. సిర్పూర్‌(టి)కి చెందిన ఇందు సీఈసీలో 471 మార్కులు సాధించగా, సిర్పూర్‌(యు) విద్యార్థిని ఎంపీసీలో 457 మార్కులు సాధించింది.

కాస్త మెరుగు

గత సంవత్సరంతో పోల్చితే ఈసారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం కాస్త మెరుగుపడింది. గత సంవత్సరం 79 శాతం మాత్రమే ఉండగా ఈసారి 82 శాతానికి పెరిగింది. అయితే గతేడాది ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, ఈసారి మాత్రం మూడో స్థానంలో ఉంది. ఒక స్థానం తగ్గినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం సంతోషకరం.

– రాందాస్‌, డీఐఈవో

రెబ్బెన మండలంలోని గంగాపూర్‌ కేజీబీవీ

పెరిగిన ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయిలో ఒక స్థానం తగ్గింది. గతేడాది ఫలితాల్లో జిల్లా 79 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలవగా, అయితే ఈసారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్రస్థాయిలో మాత్రమే మూడో స్థానంలో జిల్లా నిలిచింది. 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా వీటిలో రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉత్తీర్ణతలో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 275 మంది విద్యార్థులకు 257 మంది(93.45 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అతి తక్కువ ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 285 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా కేవలం 141 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ఓవరాల్‌గా జిల్లాలోని విద్యార్థులు గత సంవత్సరం కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించడం సంతోషకరం.

Advertisement
 
Advertisement
Advertisement