విచ్చలవిడిగా విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా విక్రయాలు

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

40 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ కవర్లపై నిషేధం వారసంతలు, దుకాణాల్లో అక్రమంగా అమ్మకాలు, వినియోగం పశువులు మృత్యువాత పడుతున్నా పర్యవేక్షణ కరువు

కాగజ్‌నగర్‌టౌన్‌/కౌటాల: జిల్లాలో నిషేధిత పాలిథిన్‌ కవర్ల విక్రయాలు, వాడకం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లపై ప్రభుత్వం పూర్తిగా నిషేధించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ నెల 10న కాగజ్‌నగర్‌ పట్టణంలోని లారీ చౌరస్తా ప్రాంతంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న నిషేధిత ప్లాస్టిక్‌ను ముందస్తు సమాచారంతో మున్సిపల్‌ అధికారులు పట్టుకున్నారు. సోమవారం అక్రమంగా పాలిథిన్‌ కవర్లు విక్రయిస్తున్న మెహరాజ్‌ హుస్సేన్‌ అనే వ్యక్తికి రూ.5 వేల జరిమానా విధించారు. మళ్లీ విక్రయిస్తే దుకాణం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

వారసంతల్లో అధిక వినియోగం

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో రోజురోజుకూ ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. అలాగే జిల్లాలోని కాగజ్‌నగర్‌, రెబ్బెన, వాంకిడి, ఆసిఫాబాద్‌, కౌటాల, బెజ్జూర్‌, దహెగాం, పెంచికల్‌పేట్‌ మండలాల్లో వారసంతలకు భారీగా వినియోగదారులు వస్తుంటారు. వందలాది మంది వ్యాపారులు విచ్చలవిడిగా 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను విక్రయిస్తున్నారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కవర్లు తీసుకువచ్చి దుకాణాలకు అమ్ముతున్నారు. పట్టణ శివార్లలోని గోదాముల్లో నిల్వ ఉంచి, వాహనాల ద్వారా దుకాణాలకు సరఫరా చేస్తున్నా యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అన్ని మండలాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పేపర్లు, కవర్లు దర్శనమిస్తున్నాయి. వీటిని తిని పశువులు, ఇతర పెంపుడు జంతువులు మృత్యువాత పడుతున్నాయి.

పర్యావరణానికి పెనుముప్పు

అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్లాస్టిక్‌ వ్యర్థాల ను అదుపు చేయకపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్‌ చెత్తే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోనూ డ్రెయినేజీలు ప్లాస్టిక్‌ కవర్లతో నిండిపోవడంతో వరద సమస్యలు తలెత్తుతున్నాయి. కవర్లను తగులబెట్టడంతో కర్బన ఉద్గారాలు విడుదలయ్యి భూతాపం పెరుగుతోంది. ఇది క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధులకు కూడా కారణమవుతోంది.

కొరవడిన అవగాహన

ప్రభుత్వం నిషేధం విధించినా, అధికారుల తనిఖీ లు నామమాత్రంగానే సాగుతున్నాయి. తనిఖీలు, జరిమానాలు నిరంతరం కొనసాగడం లేదు. జూట్‌ బ్యాగులు, పేపర్‌ బ్యాగుల వంటి ప్రత్యామ్నాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మున్సిప ల్‌, పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే నష్టాలపై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కౌటాల పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులకు జరిమానాలు విధిస్తున్నామని, ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

తనిఖీలు చేపట్టాలి

కిరాణ షాపులు, బేకరీల నిర్వాహకులు కవర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. యజమానులు అధిక మొత్తంలో నిల్వ చేసి చిరు వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలి. వారసంతల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే నష్టాలు, పేపర్‌ బ్యాగుల వినియోగంపై అధికారులు అవగాహన కల్పించాలి. – శంకర్‌, కౌటాల

నిషేధిత కవర్లు విక్రయిస్తే చర్యలు

40 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ కవర్లు వాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని దుకాణాల్లో నిషేధిత కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. దుకాణాలను సీజ్‌ చేస్తాం. షాపుల్లో నిషేధిత ప్లాస్టిక్‌ విక్రయిస్తే ప్రజలు నిర్భయంగా అధికారులకు సమాచారం ఇవ్వాలి.

– తిరుపతి, మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement