ఆసిఫాబాద్: ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని జనాభా గణన రాష్ట్ర సంచాలకులు భారతి హోళీకేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంచాలకులు మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభించే ఇళ్ల గణనలో భాగంగా ఇళ్ల జాబితా బ్లాక్‌లను రూపొందించాలన్నారు. ఎన్యుమరేటటర్లు, సూపర్‌వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,689 ఇళ్ల జాబితా బ్లాక్‌లను గుర్తించామని, 10 శాతం అదనపు సిబ్బందితో కలిసి 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. సిబ్బందికి త్వరలో మండలాల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సీపీవో వాసుదేవరెడ్డి, డిప్యూటీ సీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో దోమల వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతూ చెత్తాచెదారం తొలగించాలన్నారు. ప్రతీవారం డ్రైడే చేపట్టాలని ఆదేశించారు. చేతి పంపులు, బావుల వద్ద నీరు నిల్వకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, నీటి ట్యాంకులు క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు దోమల స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ యంత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.


