సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

● నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభారి రజత్‌ కుమార్‌ సైనీ

ఆసిఫాబాద్‌: నీతి ఆయోగ్‌ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్‌ లక్ష్యాలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సాధించాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభారి రజత్‌కుమార్‌ సైనీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం సంబంధిత అధికారులతో సంపూర్ణత అభియాన్‌ 2.0లో అమలవుతున్న పనులు లక్ష్యాల సాధనపై కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. తిర్యాణి బ్లాక్‌, జిల్లా బ్లాక్‌ల కోసం ప్రణాళిక రూపొందించాలని, అంగన్‌వాడీల్లో పిల్లల సామ్‌ మామ్‌ కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి సరైన చికిత్స అందించాలని సూచించారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషణ దినోత్సవ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణాలను వందశాతం పూర్తి చేయాలని, పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మించి వచ్చే విద్యాసంవత్సరంలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో సంపూర్ణత అభియాన్‌లో భాగంగా కలెక్టర్‌ హరిత, డీఎంహెచ్‌వో సీతారాం, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ సుబోధ్‌కుమార్‌, జీజేహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి అంబులెన్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సంపూర్ణత అభియాన్‌ జిల్లా సమన్వయకర్త బాలరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement