చెన్నూర్‌రూరల్: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలోని కొందరు రైతులు నా లుగేళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. మంచి ర్యాల జిల్లా వ్యాప్తంగా 800ల మంది రైతులు 3, 500 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 600 ఎకరాల్లో పంట దిగుడి వస్తోంది. క్వింటాలుకు రూ.2005 ధర పలుకుతోంది. కాగా ఈ వేసవిలో ఎండలు బాగా ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు పె రగడంతో మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. కొ త్తగా సాగు చేస్తున్న రైతులు, గతంలో సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యావనశాఖ అధికారి కళ్యాణి సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆయిల్‌పామ్ తోటల్లో ఒకటి నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును పచ్చిరొట్ట ఎరువుగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన వెంటనే చిన్నచిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ప్రతీ మొక్కకు ఇరువైపులా మైక్రోజెట్ అమర్చుకోవాలి. వేసవిలో చిన్న మొక్కలకు ప్రతీరోజు 150 నుంచి 160 లీటర్ల నీటిని అందించాలి. ఎదిగిన మొక్కకు రోజుకు 250 లీటర్ల నుంచి 330 లీటర్ల నీటిని అందించాలి. మూడేళ్లలోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతినెలా తొలగించాలి. ఎండిన, విరిగిన, చీడపీడలు సోకిన ఆకులను అవసరం మేరకు మాత్రమే తొలగించాలి. చెలుపు లేదా వృథాగా వచ్చిన ఆకులను నరకవద్దు. అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు పోషకాలు తప్పనిసరిగా అందేలా చూడాలి. రైతులు సిఫారసు చేసిన పద్ధతిలో మొక్కలకు పోషకాలు అందించి వివరాలను డైరీలో నమోదు చేయాలి. ఎదిగిన మొక్కల గెలలు కోసిన తర్వాత వచ్చిన ఆకులను, మగ పూలగుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ ఆయిల్‌పామ్ గెలలను పాదులలో మల్చింగ్‌గా పరవాలి. ఎదిగిన తోటలలో పక్వానికి వచ్చిన గెలను అల్యూమినియం కడ్డీ లేదా కత్తితో కోయాలి. ఎదిగిన తోటలకు నెలకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2.5 కేజీల మెగ్నీషియం సల్ఫేట్, కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫెర్టిగేషన్ ద్వారా ఎకరా విస్తీర్ణంలో మొక్కలకు అందించాలి. తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి నమూనా సేకరించి విశ్లేషణకు పంపించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండల బారి నుండి మొక్కలను కాపాడుకోవచ్చు. అధిక దిగుబడులు పొందవచ్చు.


