బేలలో శనగ రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బేలలో శనగ రైతుల ఆందోళన

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

కై లాస్‌నగర్‌(బేల): బేల మండల కేంద్రంలోని సబ్‌ మార్కెట్‌యార్డులో వారం రోజులుగా శనగ కొనుగోళ్లను నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌చౌక్‌లో గల అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శనగ కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. క్యూఆర్‌ కోడ్‌ లేదని చెప్పడంతో పంటను మార్కెట్‌లో కుప్పలుగా పోసుకుని రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 75శాతం పంట రైతుల ఇళ్లలోనే ఉందని , అయితే అధికారులు మాత్రం కోటా పూర్తయిందని కొనుగోళ్లు నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రైతుల వద్దనున్న శనగ పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement