చెన్నూర్‌రూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. కానీ పాడి పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదు. పాడి పశువులు అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందితే బీమా సౌకర్యం లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 12,09,436 మూగజీవాలు ఉన్నాయి. ఇందులో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. పాడి పశువులకు బీమా ఉంటే ఆయా సంస్థల నుంచి గతంలో పశువుల అంచనాను బట్టి రూ.50 వేల వరకు నష్ట పరిహారం వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి సౌకర్యం కల్పించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద ఉన్న ఆవులు, గేదెలు, ఎద్దులకు గతంలో లాగే ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చెన్నూర్ మండలం కత్తెరసాల, అక్కెపల్లి, శివలింగాపూర్, కాచన్‌పల్లి, గంగారం, సుద్దాల, తుర్కపల్లి, లింగంపల్లి, కాంబోజీపేట, అంగ్రాజ్‌పల్లి, ఎర్రగుంటపల్లి, బావురావుపేట, కిష్టంపేట, బుద్దారం, సంకారం గ్రామాల్లో రైతులు వ్యవసాయంతో పాటు ఎక్కువగా పాడి పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో బీమా సౌకర్యం ఉన్నప్పుడు పశువులు అనారోగ్యంతో మృతి చెందితే ఎంతో కొంత పరిహారం వచ్చేది. కానీ ప్రస్తుతం బీమా సౌకర్యం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.


