మందమర్రిరూరల్: డిపాజిట్ చేసిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మందమర్రి మార్కెట్‌లోని సహారా ఇండియా కార్యాలయం ఎదుట డిపాజిట్ దారులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సదరు సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బుల కాలపరిమితి ముగిసి నాలుగైదేళ్లు కావస్తున్నా ఇవ్వడంలేదన్నారు. కార్యాలయంలో అడిగితే పొంతనలేని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బాధితులు వెంకటయ్య, సంజీవ్, రాజమౌళి, నరేష్‌బాబు, సంపత్, మధు, మల్లేశ్వరి, రమాదేవి, లక్ష్మి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తాంసి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలు వురికి తీవ్ర గాయాలైన సంఘటన గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది స మీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాంసికి చెందిన పది మంది మహిళలు ఆదివారం ఉదయం మ్యాక్స్ వాహనంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌కు వెళ్లి వస్తుండగా సీతాగొంది సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో సోమ హేమలత (62) అక్కడికక్కడే మృతి చెందగా సోమ సుజాత, గంగామాత, వాసవి, శ్రీదేవి, మంత్రి అనిత, వినోద, లక్ష్మి, లావణ్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమ సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


