ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలకు రక్షణ ఉంటుందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో జాతీయ రహదారి పక్కన హెల్మెట్ చౌక్‌ను ఆదివారం ఎస్పీ నితిక పంత్‌తో కలిసి ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ద్విచక్ర వాహనదారులు భద్రత కోసం విధిగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా చేరవేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై చైతన్యం పెంచేందుకు ఈ హెల్మెట్ చౌక్ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మన ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడవచ్చన్నారు. 18 నుంచి 40 ఏళ్ల వారే ప్రమాదాల్లో ఎక్కువగా మృత్యువాత పడుతున్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల అంకం ముగిసిందని, ప్రస్తుతం ఐదుగురు మాత్ర మే ఉన్నారని పేర్కొన్నారు. మావోలతో ముప్పు ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు కేటాయించిన గన్‌మెన్లను తొలగిస్తామన్నారు. అంతకు ముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ డీజీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. భరోసా కేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. వాంకిడి మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ వహీదొద్దీన్, సీఐలు బాలాజీ వరప్రసాద్, రమేశ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


