గతేడాది బెల్లంపల్లిలో వ్యాపారులు రాక వెలవెలబోయిన మార్కెట్ ఈసారైనా వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టేనా? లేదంటే రైతులకు నాగ్‌పూర్ మార్కెటే దిక్కు
చెన్నూర్:ఉమ్మడి జిల్లాలోనే మామిడి దిగుబడిలో మంచిర్యాల జిల్లాకు పేరుంది. మంచిర్యాల జి ల్లాలో 6,707 మంది రైతులు ఉండగా 15, 643.77 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట లు ఉన్నాయి. జిల్లాలో దిగుబడి అయిన నా ణ్యమైన మామిడి తెలంగాణ, మహారాష్ట్ర, గుజ రాత్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతుంది. ఇక్కడి మామిడికి అన్ని రా
ష్ట్రాల్లో డిమాండ్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రజ లు, వ్యాపారులు ఇక్కడి మామిడి పైనే దృష్టి సా రిస్తున్నారు. కానీ ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్నచందంగా ఉంది జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. జిల్లాలో స్థిరమైన మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతులు మామిడి కా యలు విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లాల్సి న దుస్థితి నెలకొంది.
మేలైన రకాలకు మంచిర్యాల మామిడి...
జిల్లాలో అధిక దిగుబడి వచ్చేమామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి. బంగెనపల్లి, తోతపరి, హిమన్‌పసంద్, కొత్తపల్లి కొబ్బరి, చెరుకురసం, పెద్ద రసాలు, చిన్న రసాలు, గుట్లీ, దసలి మాత్రమే కాకుండా మరెన్నో రకాల మామిడికాయలు లభిస్తాయి. ఈ ప్రాంత కాయలు రుచితో పాటు నాణ్యత ఎక్కువగా ఉండడంతో వివిధ రాష్ట్రాల వ్యాపారులు మంచిర్యాల జిల్లా మామిడిపైనే ఆధారపడుతారు. మామిడి కాతకు ముందే నాగ్‌పూర్ వ్యాపారులు జిల్లా రైతులను కలిసి అడ్వాన్స్‌లు ఇచ్చి వెళ్తుండడం విశేషం.
బెల్లంపల్లిలో మార్కెట్ ఏర్పాటు చేసినా..
గతేడాది బెల్లంపల్లిలో మామిడి మార్కెట్‌ను ప్రారంభించారు. మామిడి విక్రయాలు జరిపేందుకు ఇద్దరే లైసెన్స్ తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు సైతం మార్కెటింగ్ చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు మార్కెట్‌ను నామమాత్రంగా నడిపించారు. రైతులు స్థానికుల కోసం కొద్దిరోజులు మార్కెట్ నడిపి ఆతర్వాత బంద్ చేశారు. ఈ ఏడాదిలో ఈ నెలాఖరు నుంచి మామిడి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌లో సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతు ల లైసెన్సులను పెంచడం లాంటి చర్యలు నేటికీ అధికారులు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది సైతం మార్కెట్‌కు వ్యాపారులు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపడుతారా? లేదంటే రైతులు నాగ్‌పూర్ మార్కెట్‌కు వెళ్లాల్సిందేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బెల్లంపల్లి మార్కెట్‌కు వ్యాపారులు వచ్చేలా..
జిల్లా రైతులు నాగ్‌పూర్ మార్కెట్‌కు వెళ్లాలంటే వేలాది రూపాయల రవాణా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. ఒక్కో లారీకి రూ.16 వేల నుంచి రూ.20వేల వరకు కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు వచ్చే లాభం కిరాయిలకే పోతుంది. బెల్లంపల్లి మార్కెట్‌కు వ్యాపారులు వచ్చేలా అధికారులు చర్యలు చేపడితే మేలు జరుగుతుందని మామిడి రైతులు పేర్కొంటున్నారు.
చెన్నూర్ ప్రాంతంలో కోసిన మామిడి కాయలు
నియోజకవర్గాల వారీగా
మామిడి సాగు విస్తీర్ణం
నియోజకవర్గం రైతులు ఎకరాలు
బెల్లంపల్లి 3,433 8,517.42
చెన్నూర్ 2,905 6,173.21
మంచిర్యాల 369 953.14
మొత్తం 6,707 15,643.77
15న సమావేశం
గతేడాది బెల్లంపల్లి మామిడి మార్కెట్‌లో ఇద్దరు మాత్రమే లైసెన్సులు పొందారు. మార్కెట్ ప్రారంభించినప్పటికీ వ్యాపారులు రాకపోవడంతో కొనుగోళ్లు జరగలేదు. ఈ ఏడాది జిల్లా మార్కెట్‌కు వ్యాపారులు, రైతులు వచ్చేలా కృషి చేస్తాం. ఈ నెల 15న రైతులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్‌లోనే మార్కెట్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తాం.
– షాబొద్దీన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, మంచిర్యాల
తగ్గిన దిగుబడి..
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది చెట్లకు పూత రాలిపోవడంతో కాయలు నిలువలేదు. దీంతో ఎకరం విస్తీర్ణంలో 20 నుంచి 30 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 5 నుంచి 6 టన్నులు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి 50 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.


