ఇంద్రవెల్లి: మండలంలోని దస్నాపూర్‌లో సంత్ సద్గురు పూలాజీబాబా ధ్యాన్ కేంద్రం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని ఆంద్ ఆదివాసీ సమాజ్‌కు చెందిన 8 జంటలు ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాల్లో వివాహ ఖర్చు తగ్గించడానికే ఏటా పూలాజీబాబా ధ్యాన్ కేంద్రంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నమని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్, గ్రామపటేల్ పుండలిక్, కరాడే మారుతి, కేశవ్, రాందాస్, పోటే సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.
16న పండ్ల తోటలకు మెగా వేలం
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీలలో ఉన్న పండ్ల తోటలకు ఈ నెల 16న ఐటీడీఏ కార్యాలయంలో మెగా వేలం పాట ని ర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి యువరాజు మర్మాట్ శుక్రవారం ఒక ప్రకటనలో తె లిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఆసిఫా బాద్ జిల్లా జంబుగా, రాజంపేట, మంచిర్యాల జిల్లా భీమారం, బెల్లంపల్లిలోని మామిడి, సపోటా తోటలకు వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతానికి భిన్నంగా మూడేళ్లకు కలిపి ఈ వేలం పాట ఉంటుందని, వ్యాపారులు, రైతులు వేలంలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఐటీడీఏ ఉద్యానవన అధికారిని సంప్రదించాలన్నారు.
విద్యుత్ కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాదం
ఖానాపూర్: పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయం గేటు సమీపంలో ఉన్న పురాతన పైపులు, ఇతర సామగ్రికి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది, స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కుటుంబాన్ని కాపాడిన పోలీసులు
బాసర: నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బాసర గోదావరిలో దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అశ్విని తన ముగ్గురు పిల్లలతో కలిసి బాసర గోదావరినదిలో దూకేందుకు యత్నిస్తుండగా గమనించిన స్థానిక పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ సంతోష్ వారికి కౌన్సెలింగ్ నిర్వహించి బాధితురాలి తల్లికి అప్పగించారు.


