ఈర్లగండిలో పురాతన శిల్పాల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఈర్లగండిలో పురాతన శిల్పాల గుర్తింపు

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

ఖానాపూర్‌, పెంబి: నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఈర్లగండి (వీరులగండి) ప్రాంతంలో రెండు పురాతన వీరగల్లు శిల్పాలను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌ కుమార్‌ ఇటీవల గుర్తించారు. వీరగల్లు శిల్పంలో వీరుడు కుడిచేతిలో బాకుతో, నడుముకు కత్తితో, చేతులు కాళ్లకు కడియాలతో, దండలకు వెండి కడియాలతో శత్రువుతో హోరాహోరీగా పోరాడుతున్నట్లు ప్రతిబింబించబడింది. పైభాగంలో సూర్య, చంద్రుల చిహ్నాలు చెక్కబడి ఉండటం గమనార్హం. ఈ శిల్పం క్రీస్తుశకం 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు.

మరోవీరగల్లు శిల్పం..

అక్కడే మరో వీరగల్లు రెండు అంతస్తులుగా చెక్కబడి ఉంది. పైభాగంలో వీరుడు చెవులకు జూకాలు ధరించి, కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో డాలు పట్టుకుని ఉండగా కింది అంతస్తులో అదే వీరుడు తన యుద్ధాశ్వాన్ని ప్రేమగా నిమురుతూ చూపించబడింది. తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరా మోజు హరగోపాల్‌ విశ్లేషిస్తూ, వీరుడు మాత్రమే కాకుండా అతని గుర్రం కూడా యుద్ధంలో ప్రాణా లు విడిచిందని అర్థమని తెలిపారు. ఇది క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిందని, చాళుక్య శైలిలో చెక్కబడినదిగా గుర్తించారు. వీటి సమీపంలోనే ఒక పురాతన మంచినీటి బావి కూడా ఉంది. ఈ వీరగల్లుల ఆధారంగా ఈ ప్రాంతానికి ఈర్లగండి (వీరులగండి) అనే పేరు స్థిరపడినట్లు తెలుస్తోంది.

పురాతన మంచినీటి బావి

Advertisement
 
Advertisement
Advertisement