ఆసిఫాబాద్‌అర్బన్: మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన నూతన ఆసిఫాబాద్ పురపాలక తొలి బడ్జెట్‌ను మంగళవారం ఆమోదించారు. జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే సరైన గౌరవం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం 2026– 27 సంవత్సరానికి సంబంధించి రూ.37.80 కోట్లతో మున్సిపల్ తొలి బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. బడ్జెట్‌ను మూడు భాగాలుగా విభజించారు. మున్సిపాలిటీకి స్వతహాగా వచ్చే నిధులు రూ.5.01 కోట్లు కాగా.. అంతే మొత్తంలో జీతాలు, ఇతర ఖర్చులు చూపించారు. డిపాజిట్ల రూపంలో రూ.60 లక్షల నిధులు సమకూరుతుండగా, దానికి సంబంధించి అంతే మొత్తం ఖర్చు ఉంది. ఇతర గ్రాంట్లకు సంబంధించి నాన్‌ప్లాన్ విభాగంలో రూ.5కోట్లు, ప్రణాళిక విభాగంలో రూ.3.65 కోట్లు రానున్నట్లు అంచనా వేశారు. మౌలిక వసతుల కల్పన కోసం ఇతర గ్రాంట్ల ద్వారా వచ్చే నిధులతో రూ.32.19 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. కౌన్సిల్ సభ్యులు పలు సందేహా లను లేవనెత్తగా.. అధికారులు, ఎమ్మెల్యే నివృత్తి చే శారు. తమ వార్డుల సమస్యలను చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకవచ్చారు.
ఆదాయం పెంచడం ద్వారానే అభివృద్ధి
పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ చైర్మన్ ఆకాశ్ తెలిపారు. అన్ని రకాల పన్నులు, అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్, నాన్ ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో బడ్జె ట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌లో అన్ని రకాల ఖర్చులు(వేతనాలు), పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ చార్జీలు, రుణాల చెల్లింపులు, గ్రీన్ బడ్జెట్, ఇంజినీరింగ్ విభాగ నిర్వహణ, సాధారణ పరిపాలనకు కేటాయింపులు చేసినట్లు వివరించారు. అదనపు ఆదాయ మార్గాలను గుర్తించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ మున్సి పాలిటీ పరిధిలోని సమస్యలను ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించా రు. ఇది మున్సిపల్ పాలక మండలి బాధ్యత అని స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆ దాయ వనరులను పెంచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ కౌన్సిలర్ల నిరసన
మున్పిపల్ చైర్మన్ కార్యాలయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, బడ్జెట్ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, సమావేశ మందిరంలో సరైన కుర్చీలు కూడా వేయకుండా అవమానిస్తున్నారని ఆరోపిస్తూ నేలపై కూర్చోని కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించారు. గతంలో ప్రొటోకాల్ ప్రకారం వైస్ చైర్మన్ కుర్చీ ఏర్పాటు చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనల ప్రకారం సమావేశ గదిలో అధికారులు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.


