పట్టణంలోని కొన్ని పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు కమర్షియల్ సిలిండర్లను అందరికీ కనిపించేలా ముందు పెడుతున్నారు. లోపల మాత్రం డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. నెలరోజులుగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోగా రెండ్రోజుల క్రితమే డీలర్లు అనేక హోటళ్లకు రెండు, మూడు చొప్పున మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, నెల రోజులుగా సరఫరా లేనప్పటికీ వారు ముందు కమర్షియల్ సిలిండర్లు ఏర్పాటు చేయడం వెనుక మరో రహస్యం ఉంది. ఖాళీగా ఉన్న కమర్షియల్ సిలిండర్లలో ప్రత్యేక యంత్రం ద్వారా డొమెస్టిక్ సిలిండర్లలోని గ్యాస్‌ను బదిలీ చేసి వినియోగిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలకు మరింత కొరత ఏర్పడి గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు సమయానికి అందక వారు ఇబ్బందులు పడుతుండగా, అక్రమార్కులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


