రెబ్బెన: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గడువు ముంచుకొస్తుండగా జిల్లాలో 83.39 శాతం లక్ష్యం పూర్తయ్యింది. అయితే నాలుగు మండలాలు టార్గెట్‌లో 80శాతం కూడా చేరుకోలేదు. దీంతో పంచాయతీ అధికారులు పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కార్యదర్శులు, సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. రికార్డుల ప్రకారం జిల్లాలో 1,36,880 ఇళ్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.6,04,12,387 కాగా.. డిమాండ్ రూ.5,79,42,840 కాగా బకాయిలు రూ.24,69,547 ఉంది. శనివారం నాటికి జిల్లాలో రూ. 5,03,78,496 పన్నులు వసూలు పూర్తయింది. మరో రూ. 1,00,33,891 పెండింగ్ ఉంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు, మద్దతుదార్లు ఇంటి పన్నులను పూర్తిగా చెల్లించడంతో కార్యదర్శులకు కొంతమేర ఊరట కలిగింది. మిగిలిన ఇళ్లకు సంబంధించిన పన్నులు, మొండి బకాయిలు వసూలు చేయడంలో వారు నిమగ్నమయ్యారు. చాలామంది వ్యవసాయ పనులకు ఉదయం పూటే వెళ్తుండటంతో సిబ్బంది ఉదయం, సాయంత్రం గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా వందశాతం వసూళ్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
‘పెంచికల్‌పేట్’లో 100 శాతం
15 మండలాల్లో ఇప్పటివరకు ఒక్క పెంచికల్‌పేట్ మండలం మాత్రమే టార్గెట్ పూర్తి చేసింది. ఈ మండలంలోని 12 పంచాయతీల్లో 4,563 ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సర ప న్నులు రూ.14,07,382 ఉండగా పాత బకా యిలు రూ.7,233 ఉన్నాయి. మొత్తం రూ. 14,14,615 వసూలు చేసి వందశాతం లక్ష్యం చేరుకున్నారు. సిర్పూర్(టి) మండలం 96 శాతం, కౌటాల 93, ఆసిఫాబాద్ 92, సిర్పూర్(యూ) 90, కాగజ్‌నగర్ 90, కెరమెరి 90శాతం లక్ష్యం సాధించాయి. ఇక జైనూర్ 62 శాతంతో అట్టడుగున నిలిచింది. తర్వాతి స్థానంలో బెజ్జూర్ 68 శాతంతో ఉంది.
పోర్టల్‌లో వివరాలు నమోదు..
జిల్లాలో 83.39 శాతం పన్నుల వసూలు కాగా, క్షేత్రస్థాయిలో దాదాపు 90 శాతానికి పైగా ఉంటుందని సమాచారం. కార్యదర్శులు వసూలు చేసిన పన్నుల వివరాలను ఈ–పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయాలి. దీనికితోడు గతంలో ఇల్లు ఉండి కూలిపోయిన వాటికి కూడా ప్రభుత్వ రికార్డుల్లో పన్ను ఉంటోంది. జాతీయ రహదారి విస్తరణ, ఇతర అభివృద్ది పనులతో కోల్పోయిన ఇళ్లు సైతం రికార్డుల్లో ఉన్నాయి. దీంతో వందశాతం పూర్తి కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. గడువులోగా సాధ్యమైనంత వరకు పన్నుల లక్ష్యం చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కృషి చేస్తున్నాం
జిల్లాలో ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం 83 శాతం చేరుకున్నాం. ప్రస్తుతం వివరాలను పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో 90శాతం వరకు పూర్తి చేసినా ఆన్‌లైన్‌లో కని పించేందుకు 24 గంటల సమయం పడుతోంది.
– ఉమర్ హుస్సేన్, డీఎల్‌పీవో
మండలాల వారీగా వసూలు వివరాలు
మండలం డిమాండ్ వసూలు శాతం బ్యాలెన్స్
జైనూర్ 36,07,266 22,13,681 62 13,93,585
బెజ్జూర్ 34,75,010 23,17,202 67 11,48,043
తిర్యాణి 35,33,542 24,63,882 70 10,69,660
లింగాపూర్ 10,34,839 7,78,998 75 2,55,841
వాంకిడి 72,43,326 56,25,928 78 16,17,398
చింతలమానెపల్లి 28,06,983 23,21,322 83 4,85,661
దహెగాం 28,67,463 23,84,349 83 4,83,114
రెబ్బెన 85,31,268 70,95,869 83 14,35,399
కెరమెరి 37,59,404 33,59,104 90 4,00,300
కాగజ్‌నగర్ 65,79,802 59,36,976 90 6,42,826
సిర్పూర్(యు) 10,47,607 9,47,086 90 1,00,521
ఆసిఫాబాద్ 41,60,666 38,02,212 91 3,58,454
కౌటాల 59,58,692 55,64,518 93 3,94,174
సిర్పూర్(టి) 43,91,904 41,42,769 94 2,49,135
పెంచికల్‌పేట్ 14,14,615 14,14,835 100 – 220


