మేల్కోకుంటే ముప్పే..! | - | Sakshi
Sakshi News home page

మేల్కోకుంటే ముప్పే..!

Mar 30 2026 8:42 AM | Updated on Mar 30 2026 8:42 AM

ప్రధాన జలాశయాలు, చెరువుల్లో అడుగంటుతున్న నీటిమట్టాలు మరమ్మతులపై దృష్టి సారించని ప్రభుత్వ యంత్రాంగం తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం

ఆసిఫాబాద్‌: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతుండటంతో రానున్న రోజుల్లో సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎండలు ముదిరితే అడ(కుమురంభీం) ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరుకుని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 236.65 మీటర్లకు తగ్గగా, మరో ప్రధాన ప్రాజెక్టు వట్టివాగు గరిష్ట నీటి మట్టం 239.500 మీటర్లు కాగా, ప్రస్తుతం 236.700 మీటర్లకు చేరింది. చెలిమెల ప్రాజెక్టులో 322.75 మీటర్లు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులో 163.00, పీపీరావు ప్రాజెక్టులో 146.150 మీటర్ల నీటి మట్టం ఉంది. అలాగే చెరువులు, కుంటల్లో కూడా నీరు, భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి.

ప్రస్తుత నీటి నిల్వ ఇలా..

కుమురంభీం ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ సామర్థ్యం 5.2 టీఎంసీలు కాగా, నీటిమట్టం 236.65 మీటర్లుగా ఉంది. ఇన్‌ఫ్లో వంద క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేయడం లేదు. మిషన్‌ భగీరథ కోసం 30 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అడ ప్రాజెక్టు ఇంటెక్‌ వెల్‌ ద్వారా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 11 వేల కనెక్షన్లు, 5 వాటర్‌ ట్యాంకులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో నీటి కొరతతో నాలుగైదు రోజులకోసారి నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయి. వేసవిలో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు సైతం ఉన్నాయి. వట్టివాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 2.89 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నత్తనడకన ‘జగన్నాథ్‌పూర్‌’

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు దశాబ్దకాలంగా నత్తనడకన నడుస్తున్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధిలోని 15 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, భూసేకరణ, ఇతర సమస్యలతో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. ఆయకట్టు రైతులకు చుక్క నీరందని దుస్థితి నెలకొంది. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిర్యాణి మండలం ఎన్‌టీఆర్‌ సాగర్‌ ప్రాజెక్టు, పీపీరావు ప్రాజెక్టుల రైతులకు కూడా పూర్తిస్థాయి ఆయకట్టు నీరందడం లేదు.

ప్రతిపాదనలు పంపించాం

కుమురంభీం ప్రాజెక్టు మరమ్మతుల కోసం అవసమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మహారాష్ట్రలోని పూణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ బృందం ప్రాజెక్టు వద్ద ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తారు. వారి నివేదక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నిధులు విడుదలైతే మరమ్మతులు చేపడతాం.

– గుణవంత్‌రావు, ఇరిగేషన్‌ ఈఈ

జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు(మీటర్లలో)

ప్రాజెక్టు గరిష్ట కనిష్ట

కుమురంభీం(అడ) 243.0 236.65

వట్టివాగు 239.5 236.7

చెలిమెల 326.3 322.7

జగన్నాథ్‌పూర్‌ 165.0 163.0

పీపీరావు 147.5 146.1

ఆనకట్టకు మరమ్మతులేవి..?

కుమురంభీం ప్రాజెక్టును 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌– టి నియోజకవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం. అయితే నాలుగేళ్ల క్రితం ప్రాజెక్టు కట్టకు పగుళ్లు తేలడంతో నీటి నిల్వలను తగ్గించారు. ఏటా వర్షాకాలంలో దెబ్బతినకుండా పాలిథిన్‌ కవర్లు కప్పి ఉంచుతున్నారు. కట్టపై వేసిన తారురోడ్డుకు సైతం బీటలు వారడంతోపాటు రక్షణగా నిర్మించిన సైడ్‌ వాల్స్‌ ధ్వంసమవుతున్నాయి. ఆనకట్ట కుడివైపు చివరి భాగంలో 700 నుంచి 990 మీటర్ల మధ్య దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. అప్పట్లో హడావుడిగా సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. మరమ్మతులకు రూ.5 కోట్లు అవసరం ఉండగా, నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులకు పైసా నిధులు విడుదల చేయలేదు. అసంపూర్తి కాల్వలతో ప్రస్తుతం కేవలం ఐదు వేల ఎకరాలకే సాగు నీరందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement