స్తంభించిన గనులు
శ్రీరాంపూర్: కేంద్రం కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా గురువారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సమ్మె కారణంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి రీజియన్‌లో మూడు డివిజన్ల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. బెల్లంపల్లి డివిజన్‌లోని ఖైరిగూర ఓసీపీ, మందమర్రి డివిజన్‌లోని కేకే ఓసీపీ కేకే 1, కేకే 2, కేకే 5, శాంతిఖని భూగర్భగనులు, శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఆర్కే 5, ఆర్కే న్యూటెక్, ఆర్కే 7, ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3, 3 ఏ, ఐకే 1ఏ భూగర్భ గనుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు, సివిల్ డిపార్టుమెంటు కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో మైనింగ్ ఆపరేషన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఓబీ పనులు కూడా జరగలేదు. కొన్ని గనులు, సీహెచ్‌పీల వద్ద సా్‌ట్‌క్ కోల్‌ను రవాణా చేసిన అధికారులు వాటిని బొగ్గు ఉత్పత్తి లెక్కల్లో చూపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సింగరేణి సెక్యూరిటీ విభాగం, సివిల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీ నష్టం
రీజియన్ పరిధిలో మొత్తం 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. దీంతో కంపెనీ రూ.9.60కోట్లు నష్టపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. రీజియన్ పరిధిలో మొత్తం 14,034 మంది ఉద్యోగులు పని చేస్తుండగా అత్యవసర సిబ్బంది మినహా మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వారు సుమారు రూ.5 కోట్లు వేతనాలు కోల్పోయారు. డివిజన్ల వారీగా శ్రీరాంపూర్‌లో 10 వేల టన్నులు, మందమర్రిలో 2 వేల టన్నులు, బెల్లంపల్లిలో 12 వేల టన్నుల నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడక్కడ ఓసీపీల్లో కొంత మేర బొగ్గు తీశారు.
నిరసనల హోరు
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీతోపాటు సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్‌టీయూలతో కూడిన జేఏసీ, మరో పక్క హెచ్‌ఎమ్మెస్‌తో కూడిన ఇతర సంఘాల జేఏసీ నేతలు వేర్వేరుగా సమ్మెలో పాల్గొన్నారు. ఒక్క బీఎంఎస్ మాత్రమే సమ్మెకు దూరంగా ఉంది. దీంతో మెజారిటీ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికుల స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం కార్మికులు గనులపైకి వచ్చి మస్టర్ పడకుండానే బయటికి వచ్చారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు గనుల గేట్ల ముందు, కూడళ్ల వద్ద లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, నాయకులు బాజీసైదా, ఐఎన్‌టీయూసీ కేంద్రం ఉపాధ్యక్షులు శంకర్‌రావు, గరిగే స్వామి, జీవన్‌జోయల్, సీఐటీయూఽ రాష్ట్ర కార్యదర్శి టీ.రాజారెడ్డి, గుల్ల బాలాజీ, చంద్రశేఖర్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందరెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేశ్, పోగాకు రమేశ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు డీ.బ్రహ్మానందం పాల్గొన్నారు.
‘మొండి వైఖరి వీడేవరకూ పోరాడుతాం’
రెబ్బెన: లేబర్ కోడ్‌ల రద్దు విషయంలో కేంద్రం మొండి వైఖరి వీడే వరకూ పోరాడుతామని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మల్రాజు శ్రీనివాస్‌రావు, ఎస్.తిరుపతి, పేరం శ్రీనివాస్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియాలో ని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో గురువారం సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులతోపాటు ఓబీ కార్మికులు, లారీ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్లు వి ధులకు గైర్హాజరయ్యారు. జీఎం కార్యాలయం, ఖైరిగూర ఓసీపీ, ఇతర గనుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేలా నాలుగు లేబర్ కోడ్‌ల ను ప్రవేశపెట్టిందన్నారు. లేబర్‌కోడ్‌లతో భవిష్యత్తులో కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమా దం ఉందని ఆరోపించారు. కార్యక్రమాల్లో ఐఎన్‌టీయూసీ నాయకులు సంగెం ప్రకాశ్‌రావు, కుమారస్వామి, గోలెం గట్టయ్య ఏఐటీయూసీ నాయకులు శేషు, టీబీజీకేఎస్ నాయకులు మంగీలాల్, మారిన వెంకటేశం, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


