● ముగిసిన నామినేషన్ల స్వీకరణ ● పోటీలో ఎక్కువగా కొత్త అభ
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం చివరిరోజు కావడంతో కొత్త అభ్యర్థులతోపాటు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసినవారు కూడా అదనపు సెట్లు వేశారు. మరోవైపు రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీలు బుజ్జగింపులకు తెరలేపాయి. ఆసిఫాబాద్‌లో 20 వార్డులు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్లు కలిసి రావడంతో మహిళలు, యువత, కొత్త అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీకి ఆసక్తి చూపారు. అయితే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పోటీలో లేకపోగా, కొత్త అభ్యర్థులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైంది. టికెట్లు ఖరారైన కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించారు. తమను గెలిపించాలని గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన అనంతరం ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువిచ్చారు. అదేరోజు తుది జాబితా ప్రకటించనున్నారు.
పూర్తికాని టికెట్ల కేటాయింపు
కీలక ఘట్టం నామినేషన్ల పర్వం పూర్తయినా ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితా ఖరారు చేయలేదు. బీఫామ్‌లు అందించలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రకటించారు. మరోవైపు టికెట్ దక్కుతుందని ఆశించి ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. టిక్కెట్ దక్కని అభ్యర్థులు బరిలో ఉంటారా.. రెబల్‌గా మారతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నామినేషన్లు పూర్తికావడంతో ప్రధాన పార్టీల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. రెబల్స్, బలమైన ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రధాన పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. తమ అభ్యర్థిని సులువుగా గెలిపించుకునేందుకు జనసేన, స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లోని రెండువర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని సమన్వయం చేయడంపై జిల్లా నాయకత్వం కసరత్తు చేస్తోంది.
చైర్‌పర్సన్ పదవిపై గురి
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవి బీసీ జనరల్‌కు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో బీసీ మహిళకు కేటాయించారు. ప్రధాన పార్టీల్లో ఈ పదవి కోసం పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధా న పార్టీలు సమర్థులై ఉండి, చదువు, ఆర్థిక స్థోమత, సమాజంలో గుర్తింపు ఉన్న అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉన్నారు. ఆసిఫాబాద్‌లో అధికార కాంగ్రెస్ నుంచి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ అబ్దుల్లా, బీఆర్‌ఎస్ నుంచి ప్రముఖ న్యాయవాది రాపర్తి రవీందర్, బీజేపీ నుంచి కవల్కర్ బాబురావు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాగజ్‌నగర్‌లో బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ సతీమణి డాక్టర్ అనిత, బీఆర్‌ఎస్ నుంచి మాజీ చైర్‌పర్సన్ విద్యావతి, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారంతా వార్డు కౌన్సిలర్‌గా గెలవడానికి యత్నిస్తున్నారు. ఇప్పటి నుంచే కొంతమంది వార్డు సభ్యులకు ఆర్థికంగా సహకరిస్తూ, మద్దతు కూడగట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
● ముగిసిన నామినేషన్ల స్వీకరణ ● పోటీలో ఎక్కువగా కొత్త అభ
● ముగిసిన నామినేషన్ల స్వీకరణ ● పోటీలో ఎక్కువగా కొత్త అభ


