గణతంత్ర వేడుకలకు ముస్తాబు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్ ఆవరణతోపాటు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో భూమి చదును చేసి షామియానాలు ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్‌ను ముగ్గులతో శోభాయమానంగా అలంకరించారు. ఆదివారం ఉదయం నుంచి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులకు ప్రశంసాపత్రాలు అందించనున్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వనున్నారు.
పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ
నెల రోజులుగా నాలుగు బెటాలియన్లకు చెందిన పోలీసులు పరేడ్ సాధన చేస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద కలెక్టర్ కె.హరిత జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. 9.10 గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరణ, 9.20 గంటలకు జిల్లా ప్రగతిపై ప్రసంగం, 9.35 గంటలకు శకటాల ప్రదర్శన, 9.45 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు, 10.10 గంటలకు ప్రశంసాపత్రాల ప్రదానం, 10.50 గంటలకు స్టాల్స్ ప్రదర్శన, సాయంత్రం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఘనంగా నిర్వహించాలి
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
క్రమశిక్షణ, సమన్వయం ముఖ్యం
ఆసిఫాబాద్‌అర్బన్: పరేడ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు క్రమశిక్షణ, సమన్వయం, సమయపాలన అత్యంత ముఖ్యమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం పోలీస్ పరేడ్ సాధనను పరిశీలించారు. పరేడ్ కమాండర్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు పరేడ్‌లో పోలీసుశాఖ ప్రతిష్ట స్పష్టంగా కనిపించాలని సూచించారు. యూనిఫాం శుభ్రత, అడుగుల సమతుల్యత, కమాండ్లపై ఏకాగ్రతతో స్పందించడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు
గణతంత్ర వేడుకలకు ముస్తాబు
గణతంత్ర వేడుకలకు ముస్తాబు


