తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

Dec 23 2025 7:09 AM | Updated on Dec 23 2025 7:09 AM

తెల్ల

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

నేటికీ రక్షణ వస్తువులు అందకపోవడంతో అవస్థలు సొంత డబ్బులతోనే స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు కొనుగోలు నెలనెలా వేతనాల చెల్లింపుల్లోనూ అలసత్వం

ఆసిఫాబాద్‌అర్బన్‌/కాగజ్‌నగర్‌టౌన్‌: తెల్లవారుజామున నాలుగు గంటలకు విధుల్లో చేరుతారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. కంపునంతా ఎత్తిపారేస్తారు. అయినా పారిశుద్ధ్య కార్మికులపై ప్రభుత్వా లు చిన్నచూపు చూస్తున్నాయి. తీవ్రమైన చలిలో అవస్థలు పడుతున్నారు. అరకొర వేతనంతో సరిపెట్టుకుంటున్నారు. గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు, దుస్తులు సకాలంలో అందడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజారోగ్యమే లక్ష్యంగా శ్రమిస్తున్నా పాలకులు కనీస శ్రద్ధ చూపడం లేదు. ప్రమాదవశాత్తు మరణించినా కార్మికులను పట్టించుకునే వారు కరువయ్యారు.

చలికి గజ గజ

జిల్లాను చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు కశ్మీర్‌ను తలపించే స్థాయిలో నమోదవుతున్నాయి. మారుమూల మండలాలతోపాటు ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోనూ పది డిగ్రీల సెల్సియస్‌లోపే ఉంటున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు చలికి పడరాని పాట్లు పడుతున్నారు. చలిలోనే వణుకుతూ పట్టణాల్లోని కాలనీలను శుభ్రం చేస్తున్నారు.

‘ఆసిఫాబాద్‌’ మున్సిపాలిటీగా మారినా..

ఆసిఫాబాద్‌ గతంలో మేజర్‌ గ్రామ పంచాయతీ. ప్రస్తుతం రాజంపేటను పంచాయతీగా, ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కానీ మున్సిపల్‌ పరిధిలోని కార్మికులకు నేటికీ పంచాయతీ వేతనాలనే చెల్లిస్తున్నారు. బల్దియా కార్మికులు ఉదయం 5 గంటలకే విధులకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణాన్ని శుభ్రం చేస్తున్నారు. చలిని తట్టుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. సొంత డబ్బులతో స్వెట్టర్లు, షూలు, కొనుక్కుంటున్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం 124 మంది కార్మికులు పాత వేతనాలతోనే విధులకు హాజరవుతున్నారు. వీరిలో కొందరికి రూ.9,500, మరికొందరికి రూ.8,500, రూ.7,500, రూ.6,000 చొప్పున వేతనాలు అందుతున్నాయి. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం వీరికి రూ.16,500 ఇవ్వాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం, హెల్త్‌కార్డులు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

కాగజ్‌నగర్‌ బల్దియాలో ఇలా..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 142 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. బల్దియా పరిధిలోని కార్మికులకు నెలనెలా వేతనాలు అందడం లేదు. మూడు, నాలుగు నెలలకు ఒక్కసారి ధర్నా చేస్తేనే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులను వేతనాల్లో కోత విధించినా ఖాతాల్లో జమ చేయడం లేదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. తెల్లవారుజామునే విధుల్లోకి చేరి రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారు. కానీ చాలా మందికి కనీసం రక్షణ వస్తువులు కూడా అందించడం లేదు. ఫలితంగా అనారోగ్యంతో మంచం పడుతున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

చలి పెరగడంతో విధులకు రావడం కష్టంగా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటూ విధులకు వస్తున్నాం. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదు. మున్సిపల్‌ చట్ట ప్రకారం చెల్లించాలి. స్వెటర్లు, గౌజ్‌లు, షూలు అందించాలి.

– కాశిపాక జ్యోతి, కార్మికురాలు, ఆసిఫాబాద్‌

ఇబ్బందులు రాకుండా చర్యలు

చలి తీవ్రత పెరగడంపై కార్మికులు ఆందోళన చెందవద్దు. ఆరోగ్య రక్షణపై ఇప్పటికే అవగాహన కల్పించాం. సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తాం. కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడికి రూ.16,500 వేతనం అందుతుంది. దీనికి సంబంధించిన నివేదికలను హైదరాబాద్‌ కార్యాలయానికి పంపించాం.

– గజానంద్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, ఆసిఫాబాద్‌

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు1
1/4

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు2
2/4

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు3
3/4

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు4
4/4

తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్‌ కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement