నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 గంటల వరకు ప్రవేశ పరీక్ష కొనసాగనుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 పరీక్ష కేంద్రాల్లో 24 మంది ఇన్విజిలేటర్లు, ఒక్కో సెంటర్‌కు ఒక అబ్జర్వర్, ఆసిఫాబాద్‌కు ఇద్దరు, మంచిర్యాలకు ముగ్గురు, నిర్మల్‌కు ఇద్దరు, ఆదిలాబాద్‌కు ముగ్గురు రూట్ ఆఫీసర్లను నియమించారు. ప్రతీ కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఇద్దరు ఎల్‌డీసీ క్లర్క్‌లు, ఒక అటెండర్ విధులు నిర్వహించనున్నారు. పోలీ సు బందోబస్తుతోపాటు ముందు జాగ్రత్తగా వైద్యాధికారులను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సూచించారు. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,632 మంది హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ మేరీ హైస్కూల్(జన్కాపూర్) టీఎస్ మోడల్ స్కూల్(ఆసిఫాబాద్), జవహర్ నవోదయ విద్యాలయం(కాగజ్‌నగర్) ఎస్టీ క్లారెట్ హైస్కూల్(కాగజ్‌నగర్), జెడ్పీఎస్‌ఎస్(సిర్పూర్– టి), టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ– బాలికలు(సిర్పూరు– టి)లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
సిర్పూర్(టి): ప్రశాంత వాతావరణంలో నవో దయ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఫర్నీచర్, గదులలో వెలుతురు, ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు.


