చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు వరిధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండలంలోని కొమురవెళ్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ కేంద్రాల ద్వారా మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, నిర్వాహకులు భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.


