విద్యార్థులపై ఫీజు భారం
పదో తరగతి పరీక్ష ఫీజు మినహాయింపు కొందరికే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చేకూరని లబ్ధి
ఆసిఫాబాద్‌రూరల్: ఫీజుల భారంతో పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా మినహాయింపు ఇచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. దీంతో విద్యార్థులు నిబంధనలకు అనుగుణంగా ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించడం సాధ్యం కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 169 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఇందులో డీఈవో పరిధిలో 58 పాఠశాలలు, 35 ప్రైవేట్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమాలు 38, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ గురుకులాలు 17 ఉన్నాయి. 6,941 మంది పదో తరగతి చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీని కోసం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.24వేల వార్షిక ఆదాయం ధ్రువపత్రం అందించాలి. దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుండగా, ఇందుకు గరిష్ట వార్షిక ఆదాయం రూ.లక్షకు పైనే ఉంటోంది. కానీ పదో తరగతి విద్యార్థులకు 30 ఏళ్లుగా అతి తక్కువ ఆదాయం కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎస్‌ఎస్‌సీ బోర్డు ఈ పరిమితి పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాసినా పరిస్థితిలో మార్పు రాలేదు. కేవలం గురుకులాలు, కేజీబీవీల్లోని విద్యార్థులు మాత్రమే నేరుగా రాయితీ పొందగలుగుతున్నారు.
ప్రైవేట్‌లో అధికంగా వసూళ్లు
ప్రస్తుతం రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. సప్లిమెంటరీ విద్యార్థులు మూడు సబ్జెక్టులోపు అయితే రూ.110, అంతకు మించి ఉంటే రూ.125 చెల్లించాలి, ఒకేషనల్ విద్యార్థులు రూ.185 చెల్లించాలి. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పొందుపర్చాల్సి ఉండగా, ఎక్కడా అమలు కావడం లేదు.


