● సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు ● కెరమెరిలో బీఆర్
కెరమెరి(ఆసిఫాబాద్): మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గిరిజన పల్లెల్లో చాలావరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తాచాటారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను హస్తగతం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలావరకు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగగా, బీఆర్‌ఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. అయితే కెరమెరి, జైనూర్ మినహ ఇతర మండలాల్లో మాత్రం గులాబీ పార్టీ తక్కువ స్థానాలకే పరిమితమైంది.
కాంగ్రెస్ వైపే ఓటర్ల మొగ్గు
గతంలో బీఆర్‌ఎస్‌కు పట్టున్న స్థానాల్లో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లో 114 పంచాయతీల్లో 55 స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ప్రజలు ఆ పార్టీకి చెందిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపారు. 114 పంచాయతీ స్థానాలకు ఏడు ఏకగ్రీవం కాగా.. ఇందులో కెరమెరిలోని బాబేఝరి, దనోరా స్థానాలు బీఆర్‌ఎస్, వాంకిడిలోని దాబా, నవేగూడ, లేండిగూడ బీఆర్‌ఎస్, లింగాపూర్‌లోని కంచన్‌పల్లి కాంగ్రెస్, మామడిపల్లిలో స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.
సత్ఫలితాలిచ్చిన ప్రచారం..
ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు పథకంతోపాటు ఆయా మండలాల్లో నూతన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. గిరిజన మహిళగా ఆమెకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు ప్రభావం చూపాయని చర్చించుకుంటున్నారు. కెరమెరి మండలంలో మాత్రం బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ఆ పార్టీ నాయకులు బలంగా ఉండటంతో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్నారు. స్వతంత్రులు కూడా 19 మంది గెలిచి వ్యక్తిగత బలాన్ని చూపారు. బీజేపీ మాత్రం అనుకున్నంత మేర రాణించలేకపోయింది.
ఉప సర్పంచ్ ఎన్నికపై వివాదం
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో వివాదం చోటుచేసుకుంది. వాంకిడిలోని జెడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, రాత్రి 11 గంటలకు కౌంటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. 14 వార్డులు ఉండగా మండోకార్ తుర్సాబాయి, దీపక్ ముండే పేర్లను ఉప సర్పంచ్‌గా ప్రతిపాదించారు. ఎన్నికల అధికారి మిగితా సభ్యులను చేతులు ఎత్తాలని కోరగా.. తుర్సాబాయికి ఆరుగురు, దీపక్ ముండేకు ఆరుగురు మద్దతుగా నిలిచారు. ఇద్దరికి ఏడేసి చొప్పున సమాన ఓట్లు లభించాయి. దీంతో టాస్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. అయితే సర్పంచ్‌గా గెలుపొందిన చునార్‌కార్ సతీశ్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరికి సమాన ఓట్లు వస్తే సర్పంచ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, టాస్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మాత్రమే సర్పంచ్ ఓటు వినియోగించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికి దీపక్ ముండే అంగీకరించలేదు. మొదట టాస్ వేస్తామని చెప్పి.. మళ్లీ సర్పంచ్ ఓటుకు ఎలా అవకాశం కల్పిస్తారని ఆయన అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికను బహిష్కరిస్తామని బయటికి వెళ్లిపోయారు. రాత్రి రెండు గంటల వరకు ఉప సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. ఏఎస్పీ చిత్తరంజన్ ఘటనాస్థలికి వచ్చి అధికారులు, వార్డు సభ్యులతో చర్చలు జరిపారు. తెల్లవారుజామున తిరిగి ఎన్నికలు నిర్వహించారు. దీపక్ ముండేకు 12 మంది మద్దతు తెలపడంతో ఆయనను ఉప సర్పంచ్‌గా ప్రకటించారు.
తేజాపూర్‌లో ప్రత్యేకాధికారి పాలన
వాంకిడి: మండలంలోని తేజాపూర్ పంచాయతీలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వేషన్ చేయగా, అక్కడ అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. 8 వార్డు స్థానాల్లో నాలుగు జనరల్, మరో నాలుగు ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి. నాలుగు వార్డు స్థానాలకు మాత్రమే సభ్యులను ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికకు కనీస కోరం ఐదుగురు అవసరం. నలుగురు మాత్రమే వార్డు సభ్యులు ఉండటంతో తేజాపూర్ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నిక సాధ్యం కాలేదు. ఇకపై అక్కడ ప్రత్యేకాధికారి పాలన మాత్రమే కొనసాగనుంది.
● సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు ● కెరమెరిలో బీఆర్
● సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు ● కెరమెరిలో బీఆర్
● సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు ● కెరమెరిలో బీఆర్


