
ప్రజల గొంతుక అయిన ‘సాక్షి’
జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్ట్ అవశ్యకత.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ‘సాక్షి’ గుర్తించింది. దశాబ్దాల కల సాకారం చేయాలని సంకల్పిస్తూ వారి తరఫున గొంతెత్తింది. తొలుత చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. ‘రెక్కలపై ఆశలు’ అంటూ ఆయా వర్గాల అభిప్రాయాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ‘మామా.. ఎయిర్‌పోర్ట్ వస్తే మనకేమొస్తది’ అంటూ స్థానిక యాసలో వివరించిన కథనం అందరినీ ఆలోచింపజేసింది. తద్వారా ఈ ప్రాంత పాలకులపై ఒత్తిడి పెరిగింది. వారు చట్టసభల్లో గళమెత్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించగా, పార్లమెంట్‌లో ఎంపీ నగేశ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీ సాక్షిగా స్పందిస్తూ ‘ఆదిలా బాద్‌కు ఎయిర్‌పోర్ట్ తెస్తా.. అది నా బాధ్యత’ అంటూ జిల్లా వాసులకు భరోసా కల్పించారు. ఆ వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ ఽశాఖలో భాగమైన భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ‘ రెక్కలొస్తున్నాయి..’ అంటూ ‘సాక్షి’ జిల్లావాసులకు తీపికబురు అందించింది. తాజాగా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. ఎయిర్‌పోర్టుతో పాటు ఎయిర్‌ఫోర్సు స్టేషన్ నిర్మాణానికి ఏఏఐ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానుండడంపై జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా ‘సాక్షి’ చొరవను సర్వత్రా కొనియాడుతున్నారు.