
పేకాడుతున్న ఏడుగురు అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఎరోడ్రమ్ సమీపంలో గల ఆమన్ స్విమ్మింగ్‌పూల్ గెస్ట్‌హౌస్‌లో శనివారం పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.23,400 నగదు, 8 సెల్‌ఫోన్లు, ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అదుపుతప్పి కారు బోల్తా
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వరంగల్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు కారులో షిరిడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ వెళ్లే క్రమంలో స్థానిక కంచరోని చెరువు కట్ట రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ అదుపుతప్పి వైద్యుడు మృతి
తరిగొప్పుల: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్‌పై తిరిగి మంచిర్యాలకు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్‌రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతడి తల, ఛాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధుడు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నాలు గు రోజుల క్రితం అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తెలిసిన వారు 8712656541, 8712658667 నంబర్‌లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
మద్యానికి బానిసై ఆత్మహత్య
జైనథ్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్యంపూర్ గ్రామానికి చెందిన కార్ల శంకర్ (35) భార్య లక్ష్మి నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి విట్టల్ తలుపు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అనాధలయ్యారు.