కాలయాపన | - | Sakshi
Sakshi News home page

కాలయాపన

Oct 19 2025 6:23 AM | Updated on Oct 19 2025 6:23 AM

కాలయాపన

కాలయాపన

● జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన కొరవి వెంకటేష్‌ తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్‌ స్తంభం శిథిలావస్థకు చేరింది. వర్షాలతో షాక్‌ వస్తుందని లైన్‌మెన్‌, ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. జూలై 28న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ● నెన్నెల మండలం అవుడంకు చెందిన ఎం.మహేష్‌ భీమారం మండలం కాజిపల్లి శివారులోని తన పొలంలో 80చింతచెట్లు తీగలకు అడ్డు వస్తున్నాయని విద్యుత శాఖ అధికారులు నరికి వేశారని, రూ.లక్షల్లో నష్టపోయానని, నష్ట పరిహారం చెల్లించాలని పలుమార్లు విద్యుత్‌ అధికారుల, ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పరిహారం అందలేదు.

గిర్రున తిరుగుతున్న మీటరు..!

కరెంటు బిల్లులతో బెంబేలు

ఫిర్యాదులపై నెలలు గడుస్తున్నా పరిశీలన కరువు

కరెంటు సమస్యలపై

మంచిర్యాలఅగ్రికల్చర్‌: సాంకేతిక లోపమో.. మరేదైనా కారణమో తెలియదు గానీ కొందరి ఇళ్లలో కరెంటు మీటరు గిర్రున తిరుగుతోంది. రూ.వేలల్లో వస్తున్న బిల్లులతో వినియోగదారులు తల పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు కరెంటు సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే నెలలు గడిచినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, హై ఓల్టేజ్‌, ప్రమాదకరంగా ఉన్నత స్తంభాలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ప్రతీ సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో విద్యుత్‌ బిల్లులతోపాటు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, తీగలతో పశువులు, మూగజీవాలు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దండేపల్లి మండలం విద్యుత్‌ స్తంభానికి షాక్‌ వస్తుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే స్తంభానికి తగిలి పశువు, లేగదూడ చనిపోవడంతో తేరుకుని సవరించారు. వినియోగదారులు నేరుగా, ఆన్‌లైన్‌, మొబైల్‌ ద్వారా ఏ ఫిర్యాదు అందించినా వెంటనే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు సూచిస్తున్నారు. అయినా కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

రెండు నెలలు గడిచింది..

ఆర్‌ఆర్‌నగర్‌లోని తన ఇంటికి గత కొన్ని నెలల నుంచి రూ.వేలల్లో విద్యుత్‌ బిల్లు వస్తోందని విద్యుత్‌ అధికారులకు, ఆగస్టు 4న ప్రజావాణిలో ఎస్‌ఈకి ఫిర్యాదు చేశాను. రూ.150 చెల్లిస్తే సిబ్బంది మీటర్‌ను పరిశీలిస్తారని చెప్పారు. ఎన్పీడీసీఎల్‌ డీఈ ఆపరేషన్‌ పేరిట నగదు చెల్లించి రెండు నెలలైంది. వందల్లో రావాల్సిన బిల్లు వేలల్లో వస్తోంది. ఈ నెల రూ.3,882 బిల్లు చెల్లించాలని, లేదంటే కరెంటు కట్‌ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు.

– జోగుల విజయ, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement