
దరఖాస్తు గడువు పొడిగింపు
కాగజ్‌నగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికిగానూ 9, 11 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కొరిపెల్లి రేణుకాదేవి శుక్రవారం తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది. చీకటి పడడంతో రాత్రి అక్కడే ఉండిపోయింది. గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
అడవిలో అరుదైన ‘హైగ్రోసైబ్ పెల్లిసిడా’
జన్నారం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నార్త్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ ఎనగందుల వెంకటేశ్ శనివారం కవ్వాల్ టైగర్‌జోన్‌లో శిలీంద్ర జాతికి చెందిన అరుదైన హైగ్రోసైబ్ పెల్లిసిడాను కనుగొన్నారు. 2024లో కేరళ రాష్ట్రంలోని హైగ్రోఫోరేసి కుటుంబంలో ఒక కొత్త జాతిగా మొదటిసారి కనుగొన్నారు. చిన్న, సున్నితమైన అగారిక్ ఫంగస్ అని తెలిపారు. ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు, చిత్తడి ప్రాంతాల్లో కనిపిస్తాయని, దీనిని వాక్స్‌కప్ అని పిలుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్‌జోన్‌లో మొదటిసారి నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు.