
తెగుళ్ల కలవరం!
ఈ ఫొటోలో వరి పైరు చూపుతున్న రైతు పేరు పాలే ఊషన్న. దహెగాం మండల కేంద్రంలో సుమారు ఎనిమిదెకరాల్లో వరి సాగు చేశాడు. అధిక వర్షాలతో పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. ముఖ్యంగా ఎండాకు తెగులుతో వరిపైరు కొనలు పూర్తిగా ఎండిపోయినట్లుగా మారాయి. ఐదు రోజుల క్రితం ఫర్టిలైజర్ షాపులో రూ.10 వేల విలువైన మందులు కొనుగోలు చేసి పిచికారీ చేశాడు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పెంచికల్‌పేట్ గ్రామానికి చెందిన నిట్టూరి నగేశ్ మూడెకరాల్లో వరిసాగు చేశాడు. గత వారం వరకు పంట బాగానే ఉన్నా.. ఎడతెరిపి లేని వర్షాలకు వరిపైరుకు ఇప్పుడిప్పుడే ఎండాకు తెగులు సోకుతోంది. నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో అతడికి పాలుపోవడం లేదు. ఫర్టిలైజర్ దుకాణ యజమాని చెప్పిందే తెచ్చి పిచికారీ చేయాల్సిన పరిస్థితి. జిల్లావ్యాప్తంగా సాగుచేస్తున్న వరి పంటలో 75 శాతం వరకు ఎండాకు తెగులు బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రారంభదశలో ఉన్న పైరుకు సకాలంలో నివారణ మందులు స్ప్రే చేస్తే కోలుకునే అవకాశం ఉంది.
దహెగాం(సిర్పూర్): ఎడతెరిపి లేని వర్షాలు చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. వరి పంటను అగ్గి తెగులు, సుడిదోమ, ఇతర తెగుళ్లు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం ఎండాకు తెగులు వరి పైరును నాశనం చేస్తోంది. నివారణకు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కనీసం నివారణ మందులు పిచికారీ చేసే సమయం కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టదశలో తెగుళ్లు విస్తరిస్తుండటంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
56 వేల ఎకరాల్లో వరి..
జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 56 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సిర్పూర్ నియోజకవర్గంతోపాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, తిర్యాణి, వాంకిడి మండలాల్లో మాత్రమే సాగు ఉంది. పంట ప్రస్తుతం పొట్ట దశకు చేరుకుంటుంది. ఈ దశలో వాతావరణ మార్పులతో చీడపీడలు సోకుతున్నాయి. కోత దశలో దోమపోటు వంటి తెగుళ్లు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాలతోపాటు తెల్లవారుజామున పొగమంచు కారణంగా దిగుబడి తగ్గే వీలుంది. తెగుళ్ల నివారణకు సకాలంలో నివారణ మందులు పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.
సలహాలు పాటించాలి
రైతులు వ్యవసాయాధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. వర్షాకాలంలో సాగయ్యే వరికి ఎండాకు తెగులు సోకుతోంది. కోనికా, ఓసీన్ మందులు పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. మండల వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
– వెంకటి, జిల్లా వ్యవసాయాధికారి

తెగుళ్ల కలవరం!

తెగుళ్ల కలవరం!