ప్రయాణ భారం! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణ భారం!

Oct 4 2025 2:09 AM | Updated on Oct 4 2025 2:09 AM

ప్రయాణ భారం!

ప్రయాణ భారం!

జిల్లా నుంచి హైదరాబాద్‌ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులేవి..? మహాలక్ష్మి పథకం ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి ఇతర బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు పెంచాలని మహిళల విన్నపం

ఆసిఫాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్దసంఖ్యలో వినియోగించుకుంటున్నారు. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే జిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు తగినన్ని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నా లగ్జరీ, లహరి వంటి బస్సులు, రైళ్లలో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ జిల్లా కేంద్రంలోని డిపో నుంచి 58 ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేశారు.

డిపోలో 81 సర్వీసులు

జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపోలో 81 బస్సు సర్వీసులు ఉండగా, 75 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో రెండు లహరి, 14 లగ్జరీ, రెండు డీలక్స్‌, 10 ఎక్స్‌ప్రెస్‌, మిగిలినవి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. డిపోలో 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 125 మంది కండక్టర్లు, 118 మంది డ్రైవర్లు, 77 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ డిపో ఆదాయం రూ.18 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు సమకూరుతోంది. నిత్యం 36,516 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, వీరిలో 25,366 మంది సీ్త్రలు, 11,150 మంది పురుషులు ఉంటున్నారు. మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో 200 కోట్ల మహిళలు వినియోగించుకున్న నేపథ్యంలో జూలైలో ఆర్టీసీ ప్రత్యేక సంబురాలు నిర్వహించింది. ఇక డిపో పరిధిలో సుమారు 2 లక్షల మహిళలు ప్రయాణించగా, రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

వయా కాగజ్‌నగర్‌తో సమయం వృథా..

జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ 14 సూపర్‌ లగ్జరీ సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం ఏడు సర్వీసులు, రాత్రి ఏడు సర్వీసులు ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు నిత్యం రాత్రి సర్వీసుల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రాత్రి సర్వీసుల్లో కేవలం రెండు బస్సులు మాత్రమే నేరుగా హైదరాబాద్‌ వెళ్తుండగా, మిగిలిన సర్వీసులు వయా కౌటాల, కాగజ్‌నగర్‌, గోలేటి నుంచి వెళ్తున్నాయి. దీంతో నేరుగా హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. బస్సు చార్జీ అధికం కావడంతోపాటు వారి సమయం కూడా వృథా అవుతోంది. లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల సంఖ్య పెంచడంతోపాటు జిల్లా కేంద్రం నుంచి నేరుగా నడిచే సర్వీసులు మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 150 కిలోమీటర్లకు మించి నడపరాదు. ఆసిఫాబాద్‌ డిపో నుంచి కొత్త సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రం నుంచి త్వరలో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం.

– రాజశేఖర్‌, ఆర్టీసీ డీఎం, ఆసిఫాబాద్‌

68 శాతం మహిళలే..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో 68 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం వారికి కేవలం ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా, కొన్ని రూట్లలో ఆ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ వెళ్లే మహిళలు ఎక్స్‌ప్రెస్‌లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఉచిత పథకం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లగ్జరీలో చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. రద్దీకి అనుగుణంగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల సంఖ్య పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement