
చోరీలతో భయం.. భయం!
కాగజ్‌నగర్‌టౌన్: చోరీలతో కాగజ్‌నగర్ పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఆరు నెలలుగా వరుస ఘటనలు చోటు చేసుకుంటుండగా, వారం రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫారెస్ట్ లైన్‌లోని ఎస్పీఎం టీఆర్టీ– 111 క్వార్టర్‌లో శుక్రవారం చోరీ జరిగింది. రాత్రి 10 గంటలకు దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మ రోజు కూడా రాత్రి ఓల్డ్ కాలనీలోని డి– 111 క్వార్టర్ ఇంటి పైకప్పు పగలగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. రెండు తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా రాత్రిపూట అగంతకులు ఇంటి తలుపులు కూడా తడుతున్నారని మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. పోలీసుల నిఘా తగ్గడంతోనే దొంగలు చేతికి పని చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తుండగా, కొందరు మాత్రం ఫిర్యాదుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సైతం చోరీల వివరాలు బయటకు పొక్కకుండా ఇంటి యజమానులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పూర్తిస్థాయి నిఘా ఏది..?
కాగజ్‌నగర్ పట్టణంలో 30 వార్డులు ఉండగా, 70 వేల వరకు జనాభా ఉంది. పట్టణంలో పోలీసు నిఘా కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రిళ్లు కాసేపు పోలీసులు వాహనం తిప్పి ఫొటోలు తీసుకోవడం తప్ప పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. గతంలో చోరీలు చేసిన నేరస్తులను పట్టుకోకపోవడం, కేసుల్లో పురోగతి లేకపోవడంతో వారే మళ్లీ ఇక్కడే చోరీలు చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా పట్టణంలోని ఎస్పీఎం క్వార్టర్స్ ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఇళ్ల చుట్టూ చెట్లు ఏపుగా పెరిగి పెరిగాయి. సిర్పూర్ పేపర్ మిల్లులో ఇతర ప్రాంతాలైన బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఒక్కో క్వార్టర్‌లో 10 నుంచి 15మంది గ్రూప్‌లుగా ఉంటున్నారు. ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడం లేదో తెలియని పరి స్థితి నెలకొంది. రాత్రి సమయంలో ఓల్డ్ కాలనీ, న్యూకాలనీ క్వార్టర్లలో అపరిచితులు తిరుగుతున్నారని కాలనీల ప్రజలే చెబుతున్నారు. పోలీసులు నిఘా పెంచి చోరీలు అరికట్టాలని కోరుతున్నారు.
నాలుగు టీంలు ఏర్పాటు చేశాం
కాగజ్‌నగర్ పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రిపూట గస్తీ పెంచుతాం. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకుంటాం. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్

చోరీలతో భయం.. భయం!