
గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం
ఆసిఫాబాద్: మహాత్మా గాంధీ చూపిన శాంతిమార్గంలో నడుద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి శివకుమార్, తహసీల్దార్ రియాజ్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ స్పెషల్ సబ్‌జైలులో గాంధీ జయంతి పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన పొరపాట్లతో కుటుంబాలకు దూరంగా ఉండి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో గాంధీ బాటలో నడవాలని సూచించారు. జైలులో ఖైదీలకు మెరుగైన సేవలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, డిప్యూటీ జైలర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.