
అంబరాన్నంటిన దసరా సంబురం
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం దసరా వేడుకలు సంబురంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయి మందిర్, కేస్లాపూర్ హనుమాన్ మందిర్ ఆవరణలో పెద్దఎత్తున వాహన పూజలు చేశారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద అర్చకులు ఇందారపు మధుకర శర్మ, నిమ్మకంటి మహేశ్‌శర్మ, వారణాసి శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో శమీ పూజ నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణాసుర వధకు లక్కీడిప్ ద్వారా శ్రీరామ చంద్రుడిని ఎంపిక చేశారు. శ్రీరామచంద్రుడిగా ఎంపికైన పట్టణానికి చెందిన చిలుకూరి రాధాకృష్ణాచారిని బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బుల్లితెర దర్శక, నిర్మాత దండనాయకుల సురేశ్‌కుమార్, ఆలయ కమిటీ అధ్వక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు శాలువా, పూలదండలతో సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రావణాసురుడి ప్రతిమను రాధాకృష్ణాచారి చేతుల మీదుగా దహనం చేశారు. పెద్దఎత్తున టపాసులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. బుల్లితెర దర్శక, నిర్మాత సురేశ్‌కుమార్ మాట్లాడుతూ చెడును జయిస్తూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. సాంస్కృతిక కళాకారులు అన్వేశ్, గౌరీశ్, భవానీ ఆలపించిన భక్తిగీతాలు అకట్టుకున్నాయి. సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధుకర శర్మ, సాయిశర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయి బాబా ఉత్సవ విగ్రహాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్‌పై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దంపతులు శమీ వృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఏఎస్పీ చిత్తరంజన్ రావణసుర దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. త్రిశూల్ పహాడ్‌పై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణస్వామి, దుర్గామాతలను దర్శించుకున్నారు. భక్తులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఆలయ కమిటీ సభ్యులు మహవీర్ ప్రసాద్‌లోయ, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ప్రేమకుమార్, అగర్వాల్, పవన్ బల్దేవ్, అరుణ్‌లోయ పాల్గొన్నారు.

అంబరాన్నంటిన దసరా సంబురం