
‘గిరిజనులకు అనుకూల రిజర్వేషన్లు ఇవ్వాలి’
తిర్యాణి: ఐదో షెడ్యూల్ కిందికి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల రిజర్వేషన్లు గిరిజనులకు అనుకులంగా ఇవ్వాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు తాము వ్యతిరేకించడం లేదని, ఐదో షెడ్యూల్‌లోని గిరిజన ప్రాంతాల్లో మాత్రం గిరిజనులకే అవకాశం కల్పించాలని కోరారు. లక్కీ లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను నిర్ణయించడం సరైనా పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఐదో షెడ్యూల్‌లోని ప్రాంతాల్లో రిజర్వేషన్లను మార్చకుంటే ఈనెల 8న హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సర్‌మేడి కుర్సింగ మోతీరాం, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు వెడ్మ భగవంత్‌రావు, నాయకులు నర్సింగరావు, ధర్ము, తదితరులు పాల్గొన్నారు.
‘అమృత్ భారత్’కు హాల్టింగ్
కాగజ్‌నగర్‌టౌన్: అమృత్ భారత్ రైలుకు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు గురువారం జెండా ఊపి హాల్టింగ్ కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ నుంచి చర్లపల్లి స్టేషన్ వరకు ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారని తెలిపారు. ఈ రైలులో 11 జనరల్, 8 స్లీపర్ కోచ్‌లు ఉంటాయన్నారు. ఈ రైలును సామాన్య, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకోసం ప్రవేశపెట్టినట్లు ఆయ న పేర్కొన్నారు. కాగజ్‌నగర్, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట్ మీదుగా చర్లపల్లి వరకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రయాణికులకు రైలు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.