
సీఎంను కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
కెరమెరి: కుమురంభీం వర్ధంతి కార్యక్రమానికి రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కుమురంభీం మనవడు కుంరం సోనేరావు, కమిటీ చైర్మన్ లాల్‌శావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఐటీడీఏ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ వెళ్లే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, మీటింగ్ స్థలం వద్ద షెడ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
కేశవనాథుడి శోభాయాత్ర
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ శ్రీ కేశవనాథస్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం చివరిరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గజవాహనంపై ఉంచి పట్టణ వీధుల గుండా భాజాభజంత్రీల మధ్య, భక్తి పాటలతో శోభాయాత్ర నిర్వహించారు. స్వామి వారికి భక్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంగళహారతి, మహా మంత్రపుష్పం, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు వైరాగడే మనోజ్‌కుమార్, సభ్యులు నిమ్మకంటి సుగుణాకర్, వైరాగడే ప్రతాప్, పరండె సాయి, ప్రవీణ్, వెంకట్, రవీందర్, అభయ్ ఆచార్య, శేషగిరి, గోపాల్, శ్రీనివాస్, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్